సానుభూతి!

30 Mar, 2018 04:24 IST|Sakshi

స్టీవ్‌ స్మిత్‌ మీడియా సమావేశంలో కళ్ళనీళ్లు పెట్టుకొని భావోద్వేగంగా మాట్లాడిన తర్వాత అతనిపై క్రికెట్‌ ప్రపంచం నుంచి సానుభూతి కురుస్తోంది. శిక్షల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు. వీరిలో స్మిత్‌తో తలపడిన ప్రత్యర్థులు కూడా ఉండటం విశేషం.  

విమానాశ్రయంలో స్మిత్‌ను తీసుకొస్తున్న దృశ్యం, అతని మీడియా సమావేశం నన్ను వెంటాడుతున్నాయి. వారు తప్పు చేశారనేది వాస్తవం. కానీ దానిని అంగీకరించారు. వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. ఈ ఘటనను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పు.     
–రోహిత్‌ శర్మ

క్రికెట్‌ను అవినీతి రహితంగా ఉంచాల్సిందే. కానీ స్మిత్, వార్నర్‌లకు వేసిన శిక్ష చాలా పెద్దది. గతంలో జీతాల పెంపు కోసం వీరిద్దరు పోరాడటం వల్లే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారేమో! ఆటగాళ్ల తరఫున నిలబడిన వారిని పరిపాలకులు అణచివేసిన చరిత్ర ఉంది. నాకు స్మిత్‌లో మోసగాడు కనిపించడం లేదు. తన దేశం కోసం గెలిచేందుకు ప్రయత్నించి నాయకుడే కనిపిస్తున్నాడు. అతను ఎంచుకున్న పద్ధతి తప్పు కావచ్చు కానీ అతడిని అవినీతిపరుడిగా ముద్ర వేయకండి.     
– గంభీర్‌  

సీఏ విచారణ లోపభూయిష్టంగా జరిగింది. శిక్షలు తీవ్రంగా ఉన్నాయి. ఐసీసీ విధించిన శిక్షలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతంలో ఇదే నేరానికి విధించిన శిక్షకు, ఇప్పటిదానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ముందూ వెనక ఆలోచించకుండా ఆటగాళ్లను ఘటన జరిగిన రోజు మీడియా ముందు ప్రవేశపెట్టడమే పెద్ద తప్పు. క్రికెటర్లకు మేం నైతిక మద్దతుతో పాటు న్యాయపరంగా కూడా సహకరిస్తాం.
– ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌

వారు తాము చేసిన పనికి బాధపడటంతో పాటు పశ్చాత్తాపం చెందుతున్నారు. తమ చర్య ద్వారా జరగబోయే తదనంతర పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులు అండగా నిలవడం ఎంతో ముఖ్యం. ఇక మనం దాని గురించి చర్చించడం మాని పక్కకు తప్పుకొని వారికి కాస్త ఏకాంతం కల్పిస్తే బాగుంటుంది.     
– సచిన్‌ టెండూల్కర్‌

స్మిత్‌ను చూస్తే చాలా బాధగా ఉంది. అతడిని ఇలాంటి స్థితిలో చూడలేం. రాబోయే రోజులు చాలా కఠినంగా గడుస్తాయి. మానసికంగా దృఢంగా ఉండమని నేను మెసేజ్‌ పంపించాను కూడా. మా ఇద్దరికీ పరస్పర గౌరవం ఉంది. ఆస్ట్రేలియాకు అతను అత్యుత్తమ కెప్టెన్‌.
– ఫాఫ్‌ డు ప్లెసిస్‌  

వార్నర్‌ చెడ్డవాడు కాదు. నేను అతనికి ప్రత్యర్థిగా, ఐపీఎల్‌లో అతనితో కలిసి ఆడాను. ఘటన జరిగిన తర్వాత కూడా మేం టచ్‌లోనే ఉన్నాం. ప్రజల భావోద్వేగాల వల్లే భారీ శిక్ష పడింది తప్ప అతను తప్పుడు మనిషి మాత్రం కాదు.
– కేన్‌ విలియమ్సన్‌  

మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు – నాకు తెలిసి స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ కొద్ది క్షణాలు మతి తప్పారంతే. వారికి రెండో అవకాశం ఇవ్వాలి. చుట్టుపక్కల ఉన్నవారు అండగా నిలవాలి.
– మైకేల్‌ వాన్‌

స్మిత్‌ ఒక మగాడిలా తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కానీ అతని ఏడుపు, కొందరు అతనితో వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా బాధేస్తోంది.
– షోయబ్‌ అక్తర్‌

ఇప్పుడు జనం కళ్లు చల్లబడ్డాయా... స్మిత్‌ మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాను.
– ఆండ్రూ ఫ్లింటాఫ్‌   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు