అడిలైడ్‌ టెస్టులో ‘విచిత్రం’ చూశారా!

10 Dec, 2018 13:17 IST|Sakshi

అడిలైడ్‌: టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు ఆట తీరు మాత్రం ప్రశంసనీయం. ఏ ఒక్క దశలోనూ భారత్‌ బౌలర్లకు అంత తేలిగ్గా లొంగని ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ తమ పోరాటంతో ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో మిగతా వారు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఆసీస్‌ ఐదో వికెట్‌ 31 పరుగుల భాగస‍్వామ్యాన్ని జత చేస్తే, ఆరో వికెట్‌కు 41 పరుగుల్ని జత చేసింది. మళ్లీ ఏడో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యం జత చేసిన ఆసీస్‌.. ఎనిమిదో వికెట్‌కు 41 పరుగుల్ని జత చేసింది. ఆపై తొమ్మిదో వికెట్ 31 పరుగుల్ని జత చేసింది. (రిషభ్‌ పంత్‌ సరికొత్త రికార్డు)

ఇలా ఐదో వికెట్‌ దగ్గర్నుంచి తొమ్మిదో వికెట్‌ వరకూ ఆసీస్‌ భాగస్వామ్యం 31పరుగులు, 41 పరుగులు మధ్య సాగడం అభిమానులకు కాస్త చిత్రంగా, ఆసక్తికరంగా అనిపించింది. ఇదిలా ఉంచితే, ఆసీస్‌ చివరి వికెట్‌కు 32 పరుగులు జత చేసింది. అయితే ఆసీస్‌ ఓటమి పాలైంది కూడా 31 పరుగుల తేడాతో కావడం ఇక్కడ గమనార్హం. భారత్‌ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌ పోరాడి ఓడింది. రెండో ఇన్నింగ్స్‌లో 291 పరుగులకే పరిమితమైన జట్టు ఓటమి చెందింది. ఆసీస్‌ ఆటగాళ్లలో షాన్‌ మార్ష్‌(60; 166 బంతుల్లో 5 ఫోర్లు), పైన్‌(41; 73 బంతుల్లో 4 ఫోర్లు) రాణించగా, మిచెల్‌ స్టార్క్‌(28; 44 బంతుల్లో 2 ఫోర్లు), ప్యాట్‌ కమిన్స్‌(28; 121 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. (తొలి టెస్టులో టీమిండియా విజయం)

మరిన్ని వార్తలు