కుప్పకూలిన హైదరాబాద్‌

7 Dec, 2018 09:40 IST|Sakshi

 తొలి ఇన్నింగ్స్‌లో 124 ఆలౌట్‌

 చెలరేగిన అవేశ్‌ ఖాన్‌ (7/24)

 మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 168/1

 రంజీ ట్రోఫీ   

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది జోరు కనబరిచిన హైదరాబాద్‌ జట్టు తదుపరి మ్యాచ్‌లోనే పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. ఇండోర్‌లో గురువారం మధ్యప్రదేశ్‌ జట్టుతో ప్రారంభమైన ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 35.3 ఓవర్లలో 124 పరుగులే చేయగలిగింది. హిమాలయ్‌ అగర్వాల్‌  (76 బంతుల్లో 69 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధ శతకంతో పోరాడాడు. కెప్టెన్‌ అక్షత్‌ రెడ్డి (21; 4 ఫోర్లు), మెహిదీహసన్‌ (15) మినహా మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ఏకంగా నలుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ కావడం గమనార్హం.

మధ్యప్రదేశ్‌ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 7 వికెట్లతో హైదరాబాద్‌ను బెంబేలెత్తించాడు. కుల్‌దీప్‌ సేన్, గౌరవ్‌ యాదవ్, వెంకటేశ్‌ అయ్యర్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ 46 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 168 పరుగులతో నిలిచింది. అజయ్‌ రొహెరా (112 బంతుల్లో 81 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రజత్‌ పటీదార్‌ (103 బంతుల్లో 51 బ్యాటింగ్‌; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో మధ్యప్రదేశ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. తనయ్‌ త్యాగరాజన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ 44 పరుగుల ఆధిక్యంలో ఉంది.   

హిమాలయ్‌ పోరాటం

ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్‌ జట్టును రెండో ఓవర్‌లోనే అవేశ్‌ ఖాన్‌ దెబ్బతీశాడు. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (0)ను బౌల్డ్‌ చేశాడు.  కొద్దిసేపటికే తనయ్‌ త్యాగరాజన్‌ (1)ను కూడా ఔట్‌ చేసి హైదరాబాద్‌కు షాకిచ్చాడు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద కె. రోహిత్‌ రాయుడు (4), బి. సందీప్‌ (0)లను అవేశ్‌ ఖాన్‌... క్రీజులో కుదురుకున్న అక్షత్‌ రెడ్డిని గౌరవ్‌ యాదవ్‌ పెవిలియన్‌ పంపడంతో 30 పరుగులు కూడా చేయకుండానే హైదరాబాద్‌ తొలి ఐదు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హిమాలయ్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ నిలబెట్టే బాధ్యతను తీసుకున్నాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ ఏకాగ్రతను కోల్పోకుండా వేగంగా పరుగులు సాధించాడు. సుమంత్‌ కొల్లా (0), టి. రవితేజ (0) విఫలమైనప్పటికీ... మెహదీ హసన్‌ కాసేపు హిమాలయ్‌కు సహకరించాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం వెంకటేశ్‌ అయ్యర్‌ బౌలింగ్‌లో మెహిదీహసన్‌ యశ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.  తర్వాత వచ్చిన రవికిరణ్‌ (1) క్రీజులో నిలవలేకపోయాడు. ముదస్సర్‌ (5) సహాయంతో 73 బంతుల్లో హిమాలయ్‌ అర్ధశతకాన్ని అందుకున్నాడు. వీరిద్దరూ పదో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో ఇదే పెద్ద భాగస్వామ్యం కావడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మధ్యప్రదేశ్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఆర్యమన్‌ విక్రమ్‌ బిర్లా (32), అజయ్‌ తొలి వికెట్‌కు 68 పరుగులు సాధించారు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రజత్‌తో కలిసి అజయ్‌ ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ అజేయ అర్ధశతకాలతో దూసుకెళ్తున్నారు.  

స్కోరు వివరాలు

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: తన్మయ్‌ (బి) అవేశ్‌ 0; అక్షత్‌ (బి) గౌరవ్‌ 21; తనయ్‌ (బి) అవేశ్‌ 1; రోహిత్‌ రాయుడు (సి) నమన్‌ఓజా (బి) అవేశ్‌ 4; సందీప్‌ (సి) నమన్‌ (బి) అవేశ్‌ 0; సుమంత్‌ (సి) శుభమ్‌ (బి) అవేశ్‌ 0; హిమాలయ్‌ నాటౌట్‌ 69; రవితేజ (బి) అవేశ్‌ 0; మెహిదీహసన్‌ (సి) యశ్‌ (బి) వెంకటేశ్‌ 15; రవికిరణ్‌ (సి) నమన్‌ఓజా (బి) కుల్‌దీప్‌ 1; ముదస్సర్‌ (బి) అవేశ్‌ 5; ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (35.3 ఓవర్లలో ఆలౌట్‌) 124.  


వికెట్ల పతనం: 1–2, 2–14, 3–29, 4–29, 5–29, 6–33, 7–37, 8–70, 9–86, 10–124.

బౌలింగ్‌: కుల్‌దీప్‌ 11–1–32–1, అవేశ్‌ ఖాన్‌ 12.3–6–24–7, గౌరవ్‌ 10–0–51–1, వెంకటేశ్‌ 2–0–16–1.
మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: ఆర్యమన్‌ (బి) తనయ్‌ 32; అజయ్‌ బ్యాటింగ్‌ 81; రజత్‌ బ్యాటింగ్‌ 51; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (46 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 168.
వికెట్ల పతనం: 1–68.

బౌలింగ్‌: రవికిరణ్‌ 12–1–40–0, ముదస్సర్‌ 7–0–33–0, రవితేజ 8–1–36–0, తనయ్‌ 13–1–38–1, మెహిదీహసన్‌ 6–1–20–0.  

మరిన్ని వార్తలు