చితక్కొట్టిన లంకేయులు

1 Jul, 2019 19:12 IST|Sakshi

చెస్టర్‌ లీ స్ట్రేట్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పవరకూ బ్యాటింగ్‌లో పెద్దగా మెరుపుల్లేని శ్రీలంక.. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెలరేగిపోయింది. ఆది నుంచి కడవరకూ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న లంకేయులు 339 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. అవిష్క ఫెర్నాండో(104;103 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో రాణించగా, కుశాల్‌ పెరీరా(64; 51 బంతుల్లో 8 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. లహిరు తిరిమన్నే(45 నాటౌట్‌; 33 బంతుల్లో 4 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో లంక భారీ స్కోరు చేసింది.టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించింది.

ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నే- కుశాల్‌ పెరీరాల జోడి లంకకు చక్కటి ఆరంభాన్ని అందించింది. వీరిద్దరూ 93 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కరుణరత్నే తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో కుశాల్‌ పెవిలియన్‌ చేరినప్పటికీ అవిష్క ఫెర్నాండో-కుశాల్‌ మెండిస్‌ల జోడి ఇన్నింగ్స్‌ను సమయోచితంగా నడిపించింది. ఈ జోడి మూడో వికెట్‌కు  85 పరుగులు జత చేయడంతో లంక భారీ స్కోరు దిశగా పయనించింది. ఆ తర్వాత ఏంజెలో మాథ్యూస్‌(26)తో కలిసి ఫెర్నాండో మరో 55 పరుగులు జత చేశాడు. చివర్లో తిరిమన్నే స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ సమయోచితంగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో హోల్డర్‌ రెండు వికెట్లు సాధించగా, కాట్రెల్‌, థామస్‌, ఫాబియన్‌ అలెన్‌లు తలో వికెట్‌ తీశారు.


 

>
మరిన్ని వార్తలు