-

అక్షర్ పటేల్ అరుదైన ఘనత

1 May, 2016 21:03 IST|Sakshi
అక్షర్ పటేల్ అరుదైన ఘనత

రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు అక్షర్ పటేల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆదివారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఏడో ఓవర్ ను అందుకున్న అక్షర్ ఐదో బంతికి దినేష్ కార్తీక్ ను, ఆరో బంతికి డ్వేన్ బ్రేవో పెవిలియన్ పంపాడు. ఆ తరువాత పదో ఓవర్ తొలి బంతికి రవీంద్ర జడేజాను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. అక్షర్ హ్యాట్రిక్ నమోదు చేసే క్రమంలో తొలి రెండు వికెట్లు బౌల్డ్ రూపంలో రావడం విశేషం. ఇది ఐపీఎల్లో  ఓవరాల్ గా 14 వ హ్యాట్రిక్ కాగా,  పంజాబ్ జట్టుకు మూడో హ్యాట్రిక్. పంజాబ్ కు ప్రాతినిథ్యం వహించిన సమయంలో యువరాజ్ సింగ్ రెండు హ్యాట్రిక్ లను ఆ జట్టును తరపున నమోదు చేశాడు.


ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించాడు. పంజాబ్ విసిరిన 155 పరుగుల సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన గుజరాత్ అక్షర్ దెబ్బకు విల్లవిల్లాడింది. అతనికి జతగా మోహిత్ శర్మ మూడు వికెట్లతో రాణించడంతో గుజరాత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు