ఆయుశ్‌ రుద్రరాజుకు స్వర్ణం

11 Jun, 2019 14:00 IST|Sakshi

అంతర్జాతీయ జూనియర్‌ షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ జూనియర్‌ షాట్‌గన్‌ కప్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుడు ఆయుశ్‌ రుద్రరాజు సత్తా చాటాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో షాట్‌గన్‌ స్కీట్‌ జూనియర్‌ పురుషుల వ్యక్తిగత విభాగంలో ఆయుశ్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో ఆయుశ్‌ 118 పాయింట్లు స్కోర్‌ చేసి స్వర్ణాన్ని సాధించాడు. భారత్‌కే చెందిన గర్చా గుర్నిహాల్‌ రజతాన్ని, చెక్‌ రిపబ్లిక్‌ షూటర్‌ కోర్చక్‌ డేనియల్‌ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

ఇదే టోర్నీ టీమ్‌ విభాగంలో తెలంగాణ రైఫిల్‌ సంఘానికే చెందిన మరో క్రీడాకారిణి జహ్రా ముఫద్దల్‌ దీసవాలా రాణించింది. ఆమె షాట్‌గన్‌ స్కీట్‌ జూనియర్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో రజత పతకాన్ని అందుకుంది. జహ్రా, అరీబా ఖాన్, పరీనాజ్‌ దలివాల్‌లతో కూడిన భారత బృందం ఫైనల్లో 312 పాయింట్లు సాధించి రన్నరప్‌గా నిలిచింది. ఈ విభాగంలో చెక్‌ రిపబ్లిక్‌ జట్టు 327 పాయిం ట్లతో పసిడి పతకాన్ని గెలుచుకోగా... జర్మనీ 310 పాయింట్లతో కాంస్యాన్ని అందుకుంది.  

మరిన్ని వార్తలు