బాబర్‌ అజామ్‌ తొలిసారి..

16 Dec, 2019 16:58 IST|Sakshi

దుబాయ్‌: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌(102) సెంచరీ సాధించడంతో అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరింతపైకి దూసుకొచ్చాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అజామ్‌ టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు 13వ స్థానంలో ఉన్న బాబర్‌ అజామ్‌ నాలుగు స్థానాలు మెరుగపరుచుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. ఫలితంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్‌-10లో నిలిచాడు. టీ20 బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న అజామ్‌.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక బ్యాట్స్‌మన్‌ విభాగం టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక్కడ కోహ్లి 928 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ను కాపాడుకున్నాడు. కాగా, ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ 911 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లికి స్మిత్‌ల మధ్య 17 పాయింట్ల వ్యత్యాసం ఉంది. న్యూజిలాండ్‌ జరిగిన తొలి టెస్టులో స్మిత్‌ 43, 16 పరుగులు చేశాడు. ఇక చతేశ్వర పుజారా(791 రేటింగ్‌ పాయింట్లు) నాల్గో స్థానంలో ఉండగా, అజింక్యా రహానే(759 రేటింగ్‌ పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నాడు. హ్యాట్రిక్‌ సెంచరీలతో అరుదైన ఘనతను సాధించిన ఆసీస్‌ క్రికెటర్‌ లబూషేన్‌ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల విభాగంలో భారత ప్రధాన పేస్‌ ఆయుధం జస్‌ప్రీత్‌ బుమ్రా ఆరో స్థానానికి పడిపోయాడు. గత కొంతకాలంగా గాయం కారణంగా మ్యాచ్‌లు దూరం కావడంతో బుమ్రా తన ర్యాంక్‌ను కోల్పోతూ వస్తున్నాడు. ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

>
మరిన్ని వార్తలు