సర్ఫరాజ్‌కు పీసీబీ షాక్‌!

7 Feb, 2020 13:40 IST|Sakshi

కరాచీ: గత కొంతకాలంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ వన్డే కెప్టెన్సీ హోదాలో మాత్రం కొనసాగుతూ వస్తున్నాడు సర్ఫరాజ్‌ అహ్మద్‌. గతేడాది అక్టోబర్‌లో సర్ఫరాజ్‌ను టెస్టు కెప్టెన్సీ, టీ20 కెప్టెన్సీ పదవుల నుంచి తొలగించిన పీసీబీ.. అజహర్‌ అలీకీ టెస్టు కెప్టెన్‌ పదవి కట్టబెట్టగా, బాబర్‌ అజామ్‌కు టీ20 సారథ్య బాధ్యతలను అప్పగించింది. అయితే పాకిస్తాన్‌కు వన్డే సిరీస్‌లు లేకపోవడంతో అప‍్పట్లో ఆ ఫార్మాట్‌ కెప్టెన్‌గా సర్ఫరాజ్‌నే  కొనసాగిస్తున్నామని పీసీబీ పేర్కొంది. అయితే ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌తో ఏకైక వన్డే జరుగుతుండటంతో సర్ఫరాజ్‌కు మొత్తంగా ఉద్వాసన పలకాలనే యోచనలో ఉంది పీసీబీ. ప్లేయర్‌గా కూడా ఆ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ చోటు ఇవ్వడానికి సుముఖంగా లేని పీసీబీ సెలక్టర్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా ఎవర్ని చేయాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారు. (ఇక్కడ చదవండి: సర్ఫరాజ్‌ ఇక దేశవాళీ ఆడుకో: ఇమ్రాన్‌)

ఈ రేసులో ముందు వరుసలో ఉన్న పేరు బాబర్‌ అజామ్‌. టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్న అజామ్‌నే వన్డే ఫార్మాట్‌కు కూడా కెప్టెన్‌గా చేయాలని పీసీబీ ఇప్పటికే ప్రణాళికలు చేసింది. అయితే సర్ఫరాజ్‌ను పక్కకు పెడుతున్నారనే వార్తల నేపథ్యంలో విమర్శలు మొదలయ్యాయి. గతేడాది వరుసగా ఆరు వన్డే మ్యాచ్‌ల్లో విజయాలు అందించిన సర్ఫరాజ్‌కు ఉద్వాసన చెప్పడం మంచి నిర్ణయం కాదని ఆ దేశీ మాజీలు అంటున్నారు. 2017లో సర్ఫరాజ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడమే కాకుండా అతనే నేతృత్వంలోని టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్‌ టాప్‌కు చేరుకుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇది సర్ఫరాజ్‌కు జరిగిన నష్టంగానే చూడాలని పాకిస్తాన్‌ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ మొహిసిన్‌ ఖాన్‌ తెలిపారు.  అతను కీపర్‌ అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే ప్లేయర్‌గా అన్యాయం చేస్తున్నారన్నాడు. 

మరిన్ని వార్తలు