యూపీ వన్డే జట్టులో అజహర్ కుమారుడు

1 Nov, 2014 00:39 IST|Sakshi
యూపీ వన్డే జట్టులో అజహర్ కుమారుడు

తొలిసారి సీనియర్ టీమ్‌కు ఎంపిక

 సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ (అబ్బాస్) ఎట్టకేలకు సీనియర్ స్థాయి క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. అయితే అది హైదరాబాద్ తరఫున కాదు. 2014-15 సీజన్ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీ(సెంట్రల్ జోన్)లో పాల్గొనే ఉత్తరప్రదేశ్ జట్టులో 24 ఏళ్ల అసద్‌కు చోటు దక్కింది. యూపీ సెలక్షన్ కమిటీ శుక్రవారం ఈ జట్టును ప్రకటించింది. 2009లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రత్యేక ట్రయల్స్‌కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు, ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు.

అయితే తండ్రి పర్యవేక్షణలో కొన్నాళ్లుగా అతను పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. గత ఏడాది హైదరాబాద్ లీగ్స్‌లో ఇండియా సిమెంట్స్ తరఫున మూడు రోజుల లీగ్ మ్యాచ్‌లు ఆడి ఆకట్టుకున్నాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్ అయిన అసద్... ఈ సీజన్‌లో కూడా ఇండియా సిమెంట్స్ తరఫునే 2 రోజుల లీగ్, వన్డే నాకౌట్‌లలో నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లి మైనర్ లీగ్ మ్యాచ్‌ల్లో కూడా పాల్గొని తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. తాజాగా యూపీ సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరై సీనియర్ టీమ్‌లో స్థానం దక్కించుకున్నాడు.

మరిన్ని వార్తలు