అజహర్‌ మొబైల్‌ గేమ్‌ ఆవిష్కరణ

10 Aug, 2017 00:46 IST|Sakshi
అజహర్‌ మొబైల్‌ గేమ్‌ ఆవిష్కరణ

ముంబై: భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ పేరుతో 3–డి మొబైల్‌ గేమ్‌ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘బిగ్‌కోడ్‌ గేమ్స్‌’ సంస్థ ఈ గేమ్‌ను రూపొందించింది. బుధవారం జరిగిన 3–డి గేమ్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ మాజీ సారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుంబ్లే నిష్క్రమణ, రవిశాస్త్రి వ్యాఖ్యలు, తనపై, శ్రీశాంత్‌పై నిషేధం తదితర అంశాలపై మాట్లాడారు. ‘కోచ్‌గా అనిల్‌ కుంబ్లే అవమానకరంగా నిష్క్రమించడం నన్ను బాధించింది. అనిల్‌ నాకు బాగా తెలుసు. ఒకరు వేలెత్తి చూపే వ్యక్తిత్వం కాదతనిది. జట్టుకు మేలు చేయాలని తపించేవాడు తప్ప చేటు చేసే వ్యక్తి కాదు.

తన ఆత్మ గౌరవం కోసమే స్వయంగా తప్పుకున్నాడు. ఇది మంచి నిర్ణయమే’ అని అన్నాడు. భారత క్రికెట్‌లో కోహ్లి జట్టే అత్యుత్తమమన్న రీతిలో ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడిన తీరును అజహర్‌ తప్పుబట్టారు. ‘అప్పటి జట్టు వేరు. ఈ జట్టు వేరు. ఇవి సమకాలీన జట్లు కానే కావు. రెండు భిన్న తరాలకు చెందిన జట్లను పోల్చడం సహేతుకం కాదు. అప్పటి బౌలర్లు, ప్రత్యర్థులు, పరిస్థితులు అన్నీ వేరు. అలాంటి జట్లను పోల్చడమేంటి? నిజానికి శాస్త్రి కూడా అప్పటి జట్టులో సభ్యుడే. అంటే తనను కూడా తక్కువ చేసుకున్నట్లే కదా’ అని అన్నారు.తనకు బోర్డు నుంచి రావాల్సిన పెన్షన్, ఏకమొత్తం చెల్లింపు సమస్య త్వరలోనే సమసి పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బోర్డుతో తనకెలాంటి శత్రుత్వం లేదని న్యాయం కోసమే కోర్టుమెట్లు ఎక్కానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్‌ హోదా గల పదవిలో ఉన్న జి.వివేక్‌ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని చెప్పారు. ఇక్కడ జీతం తీసుకుంటున్నారా లేదా అన్నది అనవసరమన్నారు.

మరిన్ని వార్తలు