‘అక్కడ నువ్వెంత స్టార్‌ అనేది చూడరు’

18 Apr, 2020 16:10 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దాంతో పలువురు ఆటగాళ్లు భారీ స్థాయిలో తమ ఐపీఎల్‌ నగదును కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడగా,  తమ రీఎంట్రీలపై ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లకు ఇది శాపంలా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన ఎంఎస్‌ ధోనికి కూడా రీఎంట్రీ కష్టమైపోయింది. ధోనిని తిరిగి భారత జట్టులోకి తీసుకోవడానికి ఎటువంటి ప్రాతిపదికా అవసరం లేదని కొంతమంది అంటుంటే, అదేలా సాధ్యమని మరికొంతమంది వాదిస్తున్నారు. ఇలా వ్యతిరేక గళం వినిపిస్తున్న వారిలో హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ కూడా చేరిపోయారు. ఏ ప్రాతిపదికన ధోనిని తీసుకుంటారనే అనుమానాన్నే అజహర్‌ కూడా వ్యక్తం చేశాడు. ఎంతటి స్టార్‌ ఆటగాడైనా జట్టులో రీఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా అది మ్యాచ్‌ప్రాక్టీస్‌తోనే సాధ్యమని అంటున్నాడు. దాని కోసం ముందుగా కొన్ని మ్యాచ్‌లు ఆడి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. (నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?)

‘జాతీయ జట్టు ఎంపికలో నువ్వెంత స్టార్‌ అనే విషయం  సెకండరీ. ప్రస్తుతం నువ్వు ఎంతటి ఫామ్‌లో ఉన్నావ్‌ అనే అంశాన్ని మాత్రమే మొదటి చూస్తారు. సుదీర్ఘ విరామం తర్వాత ధోని జట్టులోకి రావడం అంత ఈజీ కాదు. స్టార్‌ ఆటగాళ్లకు కూడా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అనేది ముఖ్యం. ఇక్కడ కావాల్సింది సాధారణ ప్రాక్టీస్‌ కాదని, మ్యాచ్‌ల్లో ప్రాక్టీస్‌ ఎలా ఉందనేదే చూస్తారు. ఇది ధోని కూడా తెలుసు. ధోని క్రికెట్‌ భవితవ్యంపై అతనికి క్లారిటీ ఉంటుంది. జాతీయ జట్టులోకి రావాలా.. వద్దా అనేది ధోని ఇష్టం. కానీ ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక జరగాలి.  

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ జరిగేలా కనిపించడం లేదు. ఈ లీగ్‌పై ఇప్పటివరకూ స్పష్టత లేదు. దాంతో ధోని మ్యాచ్‌ ప్రాక్టీస్‌లకు దూరమైనట్లే.  ఇక్కడ ప్రాక్టీస్‌- మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అనేవి రెండు వేర్వేరు అంశాలు’ అని అజహర్‌ పేర్కొన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది.  దీంతో ఎంఎస్ ధోని తిరిగి ప్రొషెషనల్‌ కెరీర్‌ను ఆరంభించడానికి అంతరాయం ఏర్పడింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. దీంతో ధోని అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.(అలా అయితే ప్రతీసారి సిక్స్‌ ఇచ్చేవాణ్ని: అక్తర్‌)

మరిన్ని వార్తలు