అంబటి రాయుడి అంశం తర్వాతే..!

29 Nov, 2019 12:51 IST|Sakshi

హైదరాబాద్‌: హెచ్‌సీఏలో అవినీతి రాజ్యమేలుతోందని ఇటీవల టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలను అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లు కనుబడటం లేదు. తాజాగా అంబటి రాయుడి చేసిన అవినీతి వ్యాఖ్యలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు అజహర్‌ దాటవేత ధోరణి అవలంభించాడు. ఆ విషయాన్ని తర్వాత చూద్దామంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. ‘ నేను ప్రస్తుతం డిసెంబర్‌ 6వ తేదీన వెస్టిండీస్‌-భారత్‌ జట్ల మధ్య హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్‌పైనే దృష్టి పెట్టా. దానికి సంబంధించి నివేదిక మాత్రమే ఇప్పుడు పరిశీలిస్తున్నా. (ఇక్కడ చదవండి: ‘అజహర్‌ స్టాండ్‌’)

హెచ్‌సీఏలో కరప్షన్‌ అంశంపై ఏమైనా మాట్లాడాలని అనుకుంటే డిసెంబర్‌ 6 తర్వాతే చూద్దాం. నేను మ్యాచ్‌కు సంబంధించి మాత్రమే ఆలోచిస్తున్నా. దీని కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఒకవేళ వేరే అంశం ఏదైనా ఉంటే అది తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడదాం. మ్యాచ్‌ను సజావుగా జరపడం కష్టంతో కూడుకున్న పని. అందులోనూ అధ్యక్ష హోదాలో ఇది నా తొలి మ్యాచ్‌.  నేను క్రికెట్‌ ఆడేటప్పుడు ఆడటం, హోటల్‌కు వెళ్లడం మాత్రమే ఉండేది. కానీ అధ్యక్ష హోదా అనేది భిన్నమైన బాధ్యతతో కూడుకున్నది’ అని అజహర్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో అజహర్‌ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

మరిన్ని వార్తలు