అజహరుద్దీన్.. ఇలా గెలిచెన్‌

27 Sep, 2019 19:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అధ్యక్షుడిగా ఆయన విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్‌ను కూడా గెలిపించుకున్నారు. హెచ్‌సీఏ చరిత్రలో ఒకే ప్యానెల్ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్‌ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్‌చంద్‌కు వచ్చిన ఓట్ల కంటే ఒక ఓటు ఎక్కువ మెజారిటీతో అజర్‌ గెలుపొందడం విశేషం. మరో ప్రత్యర్థి దిలీప్‌కుమార్‌కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యం సాధించారు.

227 ఓట్లకు గాను 223 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాండ్రా బ్రాన్‌గాంజా(మహిళా క్రికెటర్‌), అర్జున్‌ యాదవ్‌(ఇండియా సిమెంట్‌), పి. వెంకటేశ్వర్లు(ఆక్స్‌ఫర్డ్‌ బ్లూస్‌ క్రికెట్‌ క్లబ్‌), శ్రీనివాస్‌ ఆచార్య(ఉస్మానియా మెడికల్‌ కాలేజీ) ఓటు వేయలేదు. మొత్తం మూడు ఓట్లు(సంయుక్త కార్యదర్శికి రెండు, కౌన్సిలర్‌కి ఒకటి) చెల్లలేదు.

ఫలించిన అజర్‌ కల
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్‌ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. హెచ్‌సీఏలో పట్టున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు, తదితరుల అండతో మాజీ అధ్యక్షుడు వివేక్ ప్యానెల్ మద్దతు ఇచ్చిన ప్రకాశ్‌చంద్‌ను చిత్తుగా ఓడించారు. వివేక్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం కూడా అజర్‌కు కలిసొచ్చింది.

కేసీఆర్‌ను కలుస్తా: అజర్‌
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో అజహరుద్దీన్ పార్టీ మారతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. టీఆర్‌ఎస్‌ మద్దతుతోనే ఆయన గెలిచారన్న చర్చ కూడా జరుగుతోంది. దీనిపై ఆయన స్పంది​స్తూ.. పార్టీ మారతానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. టీఆర్ఎస్‌లో చేరతానో, లేదో చెప్పే వేదిక ఇది కాదని అన్నారు. తన ప్యానల్‌తో సహా ప్రగతి భవన్‌కు వెళ్లి శనివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నట్టు తెలిపారు. క్రికెట్‌ అభివృద్ధి గురించి సీఎంతో చర్చిస్తానని చెప్పారు. కాగా, అజహరుద్దీన్.. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న సం‍గతి తెలిసిందే.

హర్షం ప్రకటించిన కాంగ్రెస్‌
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజహరుద్దీన్ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం ప్రకటించింది. అజహరుద్దీన్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు అభినందనలు తెలిపారు. వి.హనుమంతరావు నేతృత్వంలో గాంధీభవన్ వద్ద బాణసంచా కాల్చి కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రేమ్‌లాల్, అఫ్జలుద్దీన్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా