ఆసీస్‌ బెదిరిపోయిన వేళ..

21 Mar, 2020 16:42 IST|Sakshi
మహ్మద్‌ అజహరుద్దీన్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ; ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుపై భారత్‌ చిరస్మరణీయమైన విజయాల్లో మనకు ఎక్కువగా గుర్తొచ్చేది 2001లో సాధించిన క్షణాలు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌(281)-రాహుల్‌ ద్రవిడ్‌(180)లు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఒక మరచిపోలేని గెలుపును సాధించి పెట్టారు.  వీరిద్దరి రికార్డు బ్యాటింగ్‌కు తోడు హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ కూడా జత కావడంతో భారత్‌ 171 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ గెలవడం ఖాయమనుక్ను తరుణంలో ద్రవిడ్‌-లక్ష్మణ్‌ల జోరు ముందు ఆ జట్టు  తేలిపోయింది. ఇక్కడ భారత్‌ ఓటమి అంచుల వరకూ వెళ్లి ఎప్పటికీ గుర్తిండిపోయే విజయాన్ని  సాధిస్తే.. అంతకంటే రెండేళ్లు ముందు  ఆసీస్‌ను బెదిరిపోయేలా చేసి భారత్‌  ‘అతి పెద్ద విజయాన్ని’ సాధించిన సందర్భం ఉంది.(మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్‌పై మోదీ ఇలా..)

అది జరిగి సరిగ్గా నేటికి 22 ఏళ్లు అయ్యింది. సరిగ్గా ఇదే రోజు(మార్చి 21) 1998లో ఆసీస్‌తో ఈడెన్‌ గార్డెన్‌లోనే జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 219 పరుగుల తేడాతో చారిత్రక గెలుపును నమోదు చేసింది.  అంత పెద్ద విజయం సాధించడానికి అప్పటి కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ కీలక పాత్ర పోషించాడు.  311 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి 246 బంతుల్ని ఎదుర్కొన్న అజహర్‌ 163 పరుగులతో అజేయంగా నిలిచాడు. అది అజహర్‌ కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటి.  

ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా బ్యాటింగ్‌ తీసుకుని తొలి ఇన్నింగ్స్‌ 233 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ వా(80), రికీ పాంటింగ్‌(60)లు మినహా ఎవరూ రాణించలేదు. దాంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు రాలేదు. ప్రధానంగా జవగల్‌ శ్రీనాథ్‌, అనిల్‌ కుంబ్లేలకు జతగా సౌరవ్‌ గంగూలీ కూడా బౌలింగ్‌లో చెలరేగి ఆసీస్‌ను దెబ్బ తీశారు. ఈ ముగ్గురూ తలో మూడు వికెట్లతో ఆసీస్‌ హడలెత్తించారు. ఆ తర్వాత భారత్‌ బ్యాటింగ్‌లో రెచ్చిపోయింది. ఓపెనర్లుగా వచ్చిన వీవీఎస్‌ లక్ష్మణ్‌(95)-నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ(97)లు తొలి వికెట్‌కు 191 పరుగులు సాధించి చక్కటి పునాది వేశారు. (మోదీ జీ.. మీ నాయకత్వం అచ్చం అలాగే: పీటర్సన్‌)

ఆపై రాహుల్‌ ద్రవిడ్‌(86), టెండూల్కర్‌(79)లు మరో సొగసైన ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆధిక్యంలో నిలిపారు. దాన్ని కెప్టెన్‌ అజహరుద్దీన్‌ భారీ సెంచరీతో ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. ఇక ఆరో స్థానంలో వచ్చిన సౌరవ్‌ గంగూలీ(65) హాఫ్‌ సెంచరీ సాధించడంతో భారత్‌ ఆరొందల మార్కును దాటింది. భారత్‌ స్కోరు 633/5 వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ను అజహర్‌ డిక్లేర్డ్‌ చేశాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ను పేకమేడలా కూల్చేశారు భారత బౌలర్లు. ప్రధానంగా అనిల్‌ కుంబ్లే తన లెగ్‌ బ్రేక్‌లతో ఆసీస్‌ పతనాన్ని శాసించాడు. కుంబ్లే ఐదు వికెట్లకు జతగా శ్రీనాథ్‌ మూడు వికెట్లతో రాణించడంతో ఆసీస్‌ 181 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌(45), ఇయాన్‌ హీలే(38), స్టీవ్‌ వా(33)లు మాత్రమే మోస్తరుగా ఆడగా.. మిగతా బ్యాట్స్‌మన్‌ విఫలమవ్వడంతో ఘోర ఓటమిని చవిచూసింది. రెండో వరల్డ్‌ వార్‌ తర్వాత ఆసీస్‌కు అదే పెద్ద  ఓటమి కాగా, అప్పటికి భారత్‌కు అదే పెద్ద విజయంగా రికార్డులకెక్కింది. అది ఇప్పటికీ భారత్‌  సాధించిన(ఇన్నింగ్స్‌ పరుగుల పరంగా)అతి పెద్ద టెస్టు విజయాల జాబితాలో టాప్‌-5లో ఉండటం ఇక్కడ మరో విశేషం. 

మరిన్ని వార్తలు