విజయంతో ముగించారు 

11 Mar, 2018 00:35 IST|Sakshi

అజ్లాన్‌షా కప్‌ హాకీ టోర్నమెంట్‌

ఇఫో (మలేసియా): సుల్తాన్‌ అజ్లాన్‌షా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. గత మ్యాచ్‌లో బలహీన ప్రత్యర్థి ఐర్లాండ్‌ చేతిలో దిబ్బతిన్న సర్దార్‌సింగ్‌ సేన శనివారం అదే జట్టును 4–1తో చిత్తుచేసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. భారత జట్టు తరఫున వరుణ్‌ కుమార్‌ (5వ, 32వ నిమిషం) రెండు గోల్స్, శైలానంద్‌ లక్డా (28వ నిమిషం), గుర్జాంత్‌ సింగ్‌ (37వ నిమిషం) చెరో గోల్‌ చేశారు. ప్రత్యర్థి జట్టులో జూలియన్‌ డాలె (48వ నిమిషం) ఏకైక గోల్‌ సాధించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన సర్దార్‌ సింగ్‌ సేన  మ్యాచ్‌ ఆసాంతం పైచేయి కొనసాగించింది.

ఐదో నిమిషంలో వచ్చిన రెండు పెనాల్టీ కార్నర్‌ అవకాశాల్లో మొదటిది వృథా కాగా... రెండో దాన్ని వరుణ్‌ కుమార్‌ గోల్‌గా మలిచి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగించిన మన ఆటగాళ్లు మరో మూడు గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించారు. చివరి క్వార్టర్‌లో ప్రత్యర్థి ఓ గోల్‌ కొట్టినా ఆధిక్యం తగ్గించడం తప్ప అది జట్టుకు ఉపయోగపడలేదు. సర్దార్‌ సింగ్‌ సారథ్యంలో ఈ టోర్నీలో భారత్‌ తొలిసారి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అతడి కెప్టెన్సీలో 2008లో రజతం, 2015, 2016లో కాంస్య, రజతాలు గెలుచుకుంది.   

మరిన్ని వార్తలు