ఆసీస్‌ చితక్కొట్టుడు.. కష్టాల్లో పాకిస్తాన్‌

23 Nov, 2019 14:07 IST|Sakshi

బ్రిస్బేన్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఆసీస్‌.. తన మొదటి ఇన్నింగ్స్‌లో 580 పరుగులు చేసింది. ఆసీస్‌ ఆటగాళ్లలో డేవిడ్‌ వార్నర్‌(154) భారీ సెంచరీ చేయగా, జో బర్న్ష్‌(97) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అటు తర్వాత ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు లబూషేన్‌(185: 279 బంతుల్లో 20 ఫోర్లు) విరుచుకుపడ్డాడు. మూడో రోజు ఆటలో ఓవర్‌నైట్‌ ఆటగాడిగా బరిలోకి దిగిన లబూషేన్‌.. పాకిస్తాన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలుత నిదానంగా ఆడిన లబూషేన్‌ ఆపై రెచ్చిపోయాడు. కాకపోతే తన టెస్టు కెరీర్‌లో తొలి శతకం సాధించిన లబూషేన్‌.. డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని 15 పరుగుల దూరంలో కోల్పోయాడు.(ఇక్కడ చదవండి: మూడు నో బాల్స్‌ వేస్తే ఒకటే చెక్‌ చేశారు..)

కాగా, స్టీవ్‌ స్మిత్‌(4) నిరాశపరచగా,  మాథ్యూ వేడ్‌(60: 97 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ సాధించడంతో ఆసీస్‌ భారీ స్కోరు సాధించింది. అటు తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్‌ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ అజహర్‌ అలీ(5), హారిస్‌ సోహైల్‌(8)లను స్టార్క్‌ పెవిలియన్‌కు పంపగా, అసద్‌ షఫీక్‌(0)ను ప్యాట్‌ కమిన్స్‌ డకౌట్‌ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. షాన్‌ మసూద్‌(27 బ్యాటింగ్‌), బాబర్‌ అజామ్‌(20 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు