బాబర్‌ను ఆకాశానికి ఎత్తిన గ్రాంట్‌ఫ్లవర్‌

27 Jun, 2019 18:06 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌ : పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌పై ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. బాబర్‌ తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే త్వరలోనే టీమిండియా పరుగుల యం‍త్రం విరాట్‌ కోహ్లిని అధిగమించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్‌ సమిష్టిగా రాణించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే సెంచరీ సాధించి పాక్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన అజమ్‌ను గ్రాంట్‌ ఫ్లవర్‌ ఆకాశానికి ఎత్తాడు. 

'బాబర్‌ మంచి టెక్నిక్‌తో పరుగులు సాధిస్తున్నాడని  కొనియాడాడు. అతను ఇప్పుడు తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరిన్ని ఆడితే రాబోయే రోజుల్లో అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. అతడు తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే త్వరలోనే కోహ్లిని మించి పోతాడని' పేర్కొన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 68 ఇన్నింగ్స్‌ల్లో  3000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా బాబర్‌ అజమ్‌ రికార్డు సాధించాడు. విరాట్‌కు 75 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా అతని కంటే ఏడు తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. ఈ జాబితాలో  దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా(57 ఇన్నింగ్స్‌లు) మొదటి స్థానంలో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు