కోహ్లి వీడియోలు చూస్తూ రెడీ అవుతున్నా: పాక్‌ క్రికెటర్‌

15 Jun, 2019 13:14 IST|Sakshi

లండన్‌ ​: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఈ మ్యాచ్‌లో గెలుపును ఇరు జట్లూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరగనున్న దాయాదుల పోరు కోసం ఇరు జట్ల అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆటగాళ్లు కూడా గెలుపే లక్ష్యంగా సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వీడియోలు చూస్తూ రేపటి మెగాపోరుకు సిద్దమవుతున్నానని పాక్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ వెల్లడించాడు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లి ఎలా బ్యాటింగ్‌ చేస్తాడో చూసి నేర్చుకుంటున్నాను. కోహ్లి గెలుపు రేషియో చాలా ఎక్కువ. నేను అతన్ని అనుకరించి అది సాధించాలనుకుంటున్నాను. ఇక చాంపియన్స్‌ ట్రోఫి విజయాన్ని మేం మరిచిపోలేకపోతున్నాం. ఆ గెలుపు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎంతో స్పూర్తినిచ్చింది. ప్రపంచం మొత్తం ఉత్సాహంగా చూసే రేపటి మ్యాచ్‌కు మేం సిద్దమయ్యాం. జట్టు మొత్తం సానుకూల దృక్పథంతో ఉంది. గెలుపే లక్ష్యంగా  బరిలోకి దిగుతాం. నేనేకాదు ఆటగాళ్లంతా జట్టు విజయంలో భాగం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు.’ అని ఆజమ్‌ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన బాబర్‌ పాక్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 
 
ప్రపంచ నెం.1 పేస్‌బౌలర్‌ అయిన బుమ్రా బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటావ్‌ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. భారత్‌కు అద్బుతమైన బౌలింగ్‌ అటాక్‌ ఉంది. కానీ మేమంతా అద్భుత బౌలింగ్‌ లైనప్‌ ఉన్న ఇంగ్లండ్‌పై విజయం సాధించాం. కాబట్టి భారత బౌలింగ్‌ను కూడా సరిగ్గా ఎదుర్కొంటాం.’ అని సమాధానమిచ్చాడు.

మరిన్ని వార్తలు