‘కోహ్లితో పోల్చడం ఇక ఆపండి’

12 Aug, 2019 12:17 IST|Sakshi

కరాచీ: తనను పదే పదే భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ శైలితో పోల్చడానికి ముగింపు పలకాలని అభిమానులకు పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌ విజ్ఞప్తి చేశాడు. తమ ఇద్దరి బ్యాటింగ్‌ శైలి వేరుగా ఉంటుందని, ఇక్కడ తమకు ఎటువంటి పోలికా లేదని పేర్కొన్నాడు. బాబర్‌ నిలకడైన ఆటతీరు అచ్చం కోహ్లీనే పోలి ఉంటుందని సోషల్‌మీడియాలో అభిమానులు అనేకసార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ విషయంపై స్పందించిన బాబర్‌ అజామ్‌ ‘కోహ్లితో నన్ను పోల్చి చూడాల్సిన అవరసమే లేదు. మా ఆటశైలి వేర్వేరుగా ఉంటుంది.

నేను కేవలం నా బ్యాటింగ్‌పైనే దృష్టిపెడతా. నా బలా బలాలను మెరుగుపర్చుకోడానికి ప్రయత్నిస్తా. మరే ఇతర ఆటగాడితో పోల్చుకునే ఆసక్తి నాకు లేదు. క్రికెటర్లకు ఇలాంటి ఆలోచనలే రావు. కేవలం సామాజిక మాధ్యమాలు, మీడియాలోనే ఇలాంటి ప్రచారాలు జరుగుతాయి. ఏ ఆటగాడు కూడా ఇతర ఆటగాళ్లతో పోల్చుకోవాలని అనుకోడు. అలా చేస్తే అనవసర ఒత్తిడి పెరిగి ఆటపై ప్రభావం చూపుతుంది’ అని వివరించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో బాబర్‌ అజమా్‌ సెంచరీ సాధించి పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  ఈ సందర్భంలో బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న గ్రాంట్‌ ఫ్లవర్‌ మాట్లాడుతూ.. బాబర్‌కు మంచి భవిష్యత్తు ఉందని, అతను విరాట్‌ కోహ్లి తరహాలో బ్యాటింగ్‌ చేస్తాడని కొనియాడాడు.

మరిన్ని వార్తలు