బ్యాక్‌ టు ద డ్రాయింగ్‌ బోర్డు: రబడ

26 Oct, 2019 12:18 IST|Sakshi

కేప్‌టౌన్‌: ఇటీవల టీమిండియా ముగిసిన టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ కావడంపై దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడ స్పందించాడు. తాము ఈ సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై విశ్లేషించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ పేర్కొన్నాడు. భారత్‌ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకునే క్రమంలో రబడా తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే సమయంలో భారత జట్టు సమష్టి ప్రదర్శనపై పొగడ్తల వర్షం కురిపించాడు. ‘ భారత పర్యటన ముగిసింది. వాళ్లు మా కంటే ఎంతో అత్యుత్తమైన ఆటను ప్రదర్శించారు. ఉత్తమ జట్టు అని టీమిండియా నిరూపించుకుంది.  ఆ జట్టుకు హ్యాట్సాఫ్‌. మా కోసం కొత్త చాలెంజ్‌లు నిరీక్షిస్తున్నాయి. బ్యాక్‌ టు ద డ్రాయింగ్‌ బోర్డు’ అంటూ రబడ ట్వీట్‌ చేశాడు.

టీమిండియాతో టీ20 సిరీస్‌ను సమం చేసుకున్న సఫారీలు.. మూడు టెస్టుల సిరీస్‌లో మాత్రం తేలిపోయారు. వరుస రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమి చవిచూశారు. భారత్‌ జట్టు అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ల్లో విశేషంగా రాణించడంతో సఫారీలు భారంగా సిరీస్‌ ముగించారు.  సిరీస్‌ను  క్లీన్‌స్వీప్‌ చేయడంతో భారత్‌ ఖాతాలో 240 టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లు చేరాయి. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ద్వారా 120 పాయింట్లను సాధించిన టీమిండియా.. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవడం ద్వారా 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు భారత జట్టే పాయింట్ల పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు