-

బ్యాడ్‌లైట్‌.. నిలిచిన మ్యాచ్‌

5 Jan, 2019 11:20 IST|Sakshi

సిడ్నీ: భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు మ్యాచ్‌ బ్యాడ్‌లైట్‌ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. శనివారం మూడో రోజు ఆటలో బ్యాడ్‌లైట్‌తో మ్యాచ్‌కు అంతరాయం కల్గింది. ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించే సమయంలో వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ను నిలిపేయాల్సి వచ్చింది. మ్యాచ్‌ నిలిచే సమయానికి ఆసీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. హ్యాండ్‌స్కాంబ్‌(28 బ్యాటింగ్‌), ప్యాట్‌ కమిన్స్‌( 25 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందు 24/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌.. భారత బౌలర్లకు దెబ్బకు విలవిల్లాడింది.  198 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు ఉస్మాన్‌ ఖవాజా(27) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరారు. తొలి సెషన్‌లో భారత్‌కు పరీక్షగా నిలిచిన ఖావాజాను కుల్దీప్‌ యాదవ్‌ బోల్తా కొట్టించడంతో ఆసీస్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మార్కస్‌ హారిస్‌కు జత కలిసిన లబుస్కాంజ్‌ ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత హారిస్‌(79) పెవిలియన్‌ చేరాడు.

రవీంద్ర జడేజా బౌలింగ్‌లో హారిస్‌ బౌల్డ్‌ కావడంతో 128 పరుగుల వద్ద ఆసీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఆపై స‍్పల్ప వ్యవధిలో షాన్‌ మార్ష్‌(8), లబూస్కాంజ్‌(38)లు ఔట్‌ కావడంతో ఆసీస్‌ 152 పరుగులకే నాలుగు వికెట్లను చేజార్చుకుంది. షాన్‌ మార్ష్‌ను జడేజా ఔట్‌ చేయగా, లబూస్కాంజ్‌ను షమీ పెవిలియన్‌ చేర్చాడు. మరో 40 పరుగుల వ్యవధిలో ట్రావిస్‌ హెడ్‌(20) సైతం పెవిలియన్‌ బాట పట్టడంతో 192 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ను నష్టపోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చిన ట్రావిస్‌ హెడ్‌ ఐదో్ వికెట్‌గా ఔటయ్యాడు.

టీ విరామం తర్వాత టిమ్‌ పైన్‌(5)ను కుల్దీప్‌ ఔట్ చేయడంతో ఆసీస్‌ మరింత కష్టాల్లోకి వెళ్లింది. ఆసీస్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో్ కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, జడేజా రెండు వికెట్లు తీశాడు. మహ్మద్‌ షమీకి వికెట్‌ లభించింది. అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 622/7  వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు