బ్యాడ్మింటన్ అకాడమీకి అవార్డు

24 Aug, 2013 01:14 IST|Sakshi
బ్యాడ్మింటన్ అకాడమీకి అవార్డు

సాక్షి, హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, పి.వి.సింధు, కశ్యప్‌లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లను తయారు చేసిన ‘పుల్లెల గోపీచంద్-నిమ్మగడ్డ ఫౌండేషన్ బ్యాడ్మింటన్ అకాడమీ’కి ప్రతిష్టాత్మక ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డు ప్రైవేట్ అకాడమీకి రావడం ఇదే తొలిసారి.  ఈ అకాడమీ బ్యాడ్మింటన్‌కు చేస్తున్న కృషికి మెచ్చి కేంద్ర క్రీడా శాఖ ఈ పురస్కారానికి ప్రతిపాదన చేసింది. ‘ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్’ విభాగం కింద ఈ అవార్డును ప్రకటించారు.
 
  సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఆర్థిక సహాయం), పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమం), అలహాబాద్‌లోని యూకే మిశ్రా జాతీయ స్పోర్ట్స్ అకాడమీ (కమ్యూనిటీ క్రీడల గుర్తింపు, యువ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం)లకు ఈ అవార్డు దక్కింది. ఈనెల 31న జరిగే కార్యక్రమంలో ఈ నాలుగు అకాడమీలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేస్తారు. ప్రతిష్టాత్మక ఈ పురస్కారం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని జాతీయ చీఫ్ కోచ్, పీజీబీఏ యజమాని గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మనం పడుతున్న శ్రమను ప్రభుత్వం గుర్తిస్తే చాలా ఆనందం కలుగుతుంది. మంచి పని చేయడానికి ఇది మరింత ప్రోత్సాహన్ని ఇస్తుంది. మా కోచ్‌లు, సహాయక సిబ్బంది, అకాడమీ ఉద్యోగులు కనబరుస్తున్న సమష్టి కృషికి లభించిన గుర్తింపు ఇది’ అని గోపీ వ్యాఖ్యానించారు.
 
 నిమ్మగడ్డ ప్రసాద్ సహకారంతోనే...
 ఈ రోజు దేశంలో అగ్రశ్రేణి షట్లర్లను తయారు చేస్తున్న బ్యాడ్మింటన్ అకాడమీకి అంకురార్పణ 2006లో జరిగింది. ఆల్‌ఇంగ్లండ్ టోర్నీ గెలిచిన గోపీచంద్‌కు ప్రభుత్వం స్థలం ఇచ్చినా... అకాడమీ నిర్మాణానికి ఆర్థిక వనరులు లేవు. దీంతో గచ్చిబౌలిలోని స్టేడియంను శాప్ దగ్గర అద్దెకు తీసుకుని అకాడమీ ప్రారంభించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్... చొరవ తీసుకుని అకాడమీ నిర్మాణం చేయించారు. 2007 కల్లా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలో అకాడమీ సిద్ధమైంది. నాడు ప్రసాద్, గోపీచంద్‌ల చొరవ వల్ల నేడు దేశంలో బ్యాడ్మింటన్‌కు భాగ్యనగరం కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
 

మరిన్ని వార్తలు