డచ్, జర్మన్‌ టోర్నీలకు సామియా, గాయత్రి

21 Feb, 2019 10:13 IST|Sakshi

జూనియర్‌ టోర్నీలకు జట్లను ఎంపిక చేసిన ‘బాయ్‌’

న్యూఢిల్లీ: జూనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్లలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్న హైదరాబాదీ అమ్మాయిలు సామియా ఇమాద్‌ ఫారుఖీ, పుల్లెల గాయత్రిలు విదేశీ టోర్నీలకు ఎంపికయ్యారు. డచ్, జర్మన్‌ అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే జూనియర్‌ జట్లను భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) బుధవారం ఎంపిక చేసింది. మొత్తం 20 మందితో కూడిన బాలబాలికల జట్లను ప్రకటించింది. ఇందులో 10 మంది చొప్పున బాలురు, బాలికలు ఉన్నారు. అయితే ఈ 20 మందిలో ఆరుగురు షట్లర్లు తెలంగాణ వారే కావడం గమనార్హం. మరొకరు ఆంధ్రప్రదేశ్‌ షట్లర్‌ సాయిచరణ్‌ కావడంతో తెలుగువారే ఏడుగురున్నారు.

డచ్‌ టోర్నమెంట్‌ ఈ నెల 27 నుంచి మార్చి 3 వరకు... అనంతరం జర్మన్‌ ఈవెంట్‌ మార్చి 7 నుంచి 10 వరకు జరుగనున్నాయి. బాలికల సింగిల్స్‌లో భారత కోచ్‌ గోపీచంద్‌ తనయ పుల్లెల గాయత్రి, సామియాలతో పాటు స్మిత్‌ తొష్నివాల్‌ (మహారాష్ట్ర), అమోలిక సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌) ఎంపికవగా, బాలుర సింగిల్స్‌లో సాయిచరణ్‌ (ఏపీ), మైస్నమ్‌ మిరబా (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ), ప్రియాన్షు రజావత్‌ (మధ్యప్రదేశ్‌), సతీశ్‌ కుమార్‌ (తమిళనాడు)లు ఉన్నారు. తెలంగాణ కుర్రాడు బొక్కా నవనీత్‌ బాలుర డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆడనున్నాడు. వర్షిణి బాలికల డబుల్స్‌లో బండి సాహితి మిక్స్‌డ్‌ డబుల్స్‌ జట్టులో ఎంపికవగా... విష్ణువర్ధన్‌ గౌడ్‌కు బాలుర డబుల్స్‌ జట్టులో చోటు దక్కింది. విజయవాడ, బెంగళూరు, జైపూర్‌ నగరాల్లో గత నెలలో నిర్వహించిన ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా షట్లర్లను ఎంపిక చేసినట్లు ‘బాయ్‌’  వెల్లడించింది. విజేతగా నిలిచిన వారికి 500 పాయింట్లు, రన్నరప్‌కు 425 పాయింట్లు, సెమీఫైనలిస్ట్‌లకు 350 పాయింట్లు, క్వార్టర్, ప్రిక్వార్టర్‌ ఫైనలిస్ట్‌లకు వరుసగా 275, 192 పాయింట్లు కేటాయించారు. దీంతో హైదరాబాదీ సామియాకు 1125 పాయింట్లు దక్కాయి.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు