బెయిర్‌ స్టో విధ్వంసం.. పాక్‌ చిత్తుచిత్తుగా

15 May, 2019 11:26 IST|Sakshi

బ్రిస్టల్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో(128; 93 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో పాకిస్తాన్‌ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా స్థానిక కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్‌పై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. బెయిర్‌ స్టో ఆకాశమే హద్గుగా చెలరేగడంలో 359 పరుగుల భారీ స్కోర్‌ కూడా చిన్నబోయింది. మరో 31 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యం పూర్తి చేసిన ఇంగ్లండ్‌ సీరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకపోయింది. బెయిర్‌ స్టోకు ప్లేయర్‌ ఆఫ్‌ ద అవార్డు లభించింది.  

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన పాక్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌ హీరో ఫఖర్‌ జామన్‌(2) పూర్తిగా విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(151; 131 బంతుల్లో 16 ఫోర్లు, 1సిక్సర్‌) భారీ శతకం సాధించాడు. ఇమామ్‌తో పాటు అసిఫ్‌ అలీ(52), సోహైల్‌(41)లు రాణించడంతో పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా, టామ్‌ కరన్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. 

అనంతరం పాక్‌ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను పాక్‌ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా బెయిర్‌ స్టోలో ఇంకా ఐపీఎల్‌ ప్రభావం తగ్గినట్టు కనిపించలేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ ఓపెనర్‌ పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.  బెయిర్‌ స్టోకు తోడుగా జాసన్‌ రాయ్‌(76), రూట్‌(43), మొయిన్‌ అలీ(46 నాటౌట్‌)లు రాణించడంతో ఇంగ్లండ్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన బెయిర్‌ స్టో ఐపీఎల్‌తో తన ఆటలో చాలా మార్పు వచ్చిందని, అక్కడ నేర్చుకున్న పాఠాలు తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు