ఇది కదా దురదృష్టమంటే..

19 Sep, 2019 20:33 IST|Sakshi

నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌) : భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియాను ఆతిథ్య దేశం ఓడించింది. అంతకుముందే తన సత్తాతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన పూనియా ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కానీ... సెమీఫైనల్లో ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్‌ రెజ్లర్‌ నియజ్బెకొవ్‌ కావడమే పూనియా పాపమైంది. దీంతో నిర్వాహకుల పక్షపాతం భారత రెజ్లర్‌ సువర్ణావకాశాన్ని దెబ్బతీసింది. సెమీస్‌ ఓటమితో బజ్‌రంగ్‌ ఇప్పుడు  కాంస్యం కోసం తలపడనున్నాడు. మరో రెజ్లర్‌ రవి దహియా కూడా టోక్యో బెర్తు ఖాయం చేసుకున్నాడు. కానీ సెమీస్‌లో అతను కూడా పరాజయం చవిచూడటంతో భారత్‌కు ఇప్పుడు రజతం, బంగారం దూరమయ్యాయి. 

అంతా కలిసి ఏక ‘పక్ష’మయ్యారు...
గత బుడాపెస్ట్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న బజ్‌రంగ్‌ ఈసారి స్వర్ణంపై కన్నేశాడు. అందుకు తగ్గట్లే కఠోరంగా శ్రమించాడు. ఎదురేలేకుండా 65 కేజీల విభాగంలో సెమీస్‌ చేరాడు. గురువారం కజకిస్తాన్‌కు చెందిన డౌలెత్‌ నియజ్బెకొవ్‌తో జరిగిన సెమీఫైనల్‌ బౌట్‌లో ఆరంభం నుంచి ఆతిథ్య దేశం ఎన్ని కుయుక్తులు చేసినా... పట్టువదలని ఈ కుస్తీవీరుడు పాయింట్లు గెలుస్తూనే వచ్చాడు. 6 నిమిషాల ఈ బౌట్‌ చివరకు 9–9 స్కోరు వద్ద ముగిసింది. అయితే నిర్వాహకులు, రిఫరీలు... ఈ కుస్తీ పోటీలో తమ కజకిస్తాన్‌ రెజ్లర్‌ త్రో పూనియా కంటే మెరుగని ఏకపక్షంగా తేల్చేశారు. ఆ సర్కిల్‌లో ప్రత్యర్థి త్రో ప్రభావవంతంగా ఉందని అదనంగా 4 పాయింట్లు కట్టబెట్టి నియజ్బెకొవ్‌ను విజేతగా ప్రకటించారు. 

క్వార్టర్స్‌లో అలవోకగా...: అంతకుముందు జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో కొరియా రెజ్లర్‌ జొంగ్‌ చొయ్‌ సన్‌తో తలపడిన బజ్‌రంగ్‌ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు. 57 కేజీల విభాగంలో రవి దహియా తొలి రెండు బౌట్లను టెక్నికల్‌ సుపీరియారిటీ ద్వారా గెలిచాడు. అనంతరం సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జౌర్‌ యుగెయెవ్‌(రష్యా) చేతిలో పరాజయం పాలై కాంస్య పోరులో నిలిచాడు.  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా