ఒలింపిక్‌ పతకం సాధించినా...

25 Sep, 2019 03:54 IST|Sakshi

ఈ ఓటమి గాయం మానదు

ప్రపంచ చాంపియన్‌షిప్‌ సెమీస్‌పై బజరంగ్‌  

న్యూఢిల్లీ: ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో తనకెదురైన ఓటమి గాయం ఒలింపిక్‌ పతకం సాధించినా మానేది కాదని భారత రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా స్పష్టం చేశాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో జడ్జీలు తీసుకున్న వివాదాస్పద నిర్ణయం కారణంగా బజరంగ్‌ ఫైనల్‌ పోరుకు అర్హత సాధించలేకపోయాడు. ‘మ్యాచ్‌లో పక్షపాతం, మోసం చేయడం ద్వారా ఎదురైయ్యే ఓటమి మనకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. నేను అక్కడ ఎటువంటి తప్పు చేయలేదు. నేను పసిడి పతకం గెలిచే అవకాశాన్ని నా తప్పుల ద్వారా చేజార్చుకోలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లు భిన్నమైన టోరీ్నలు. నేను ప్రపంచ చాంపియన్‌షిప్‌ కోసం చాలా కష్టపడ్డా. ఒలింపిక్‌ పతకం గెలిచినా ప్రస్తుతం నాకు ఎదురైన ఓటమి గాయం మానదు. ఇటువంటి ఓటములు భవిష్యత్తులో ఎదురైతే నాకు ఈ ఓటమే గుర్తొస్తుంది’ అంటూ బజరంగ్‌ బదులిచ్చాడు.  

జాతీయ క్రీడగా రెజ్లింగ్‌ను ప్రకటించండి!
జాతీయ క్రీడగా రెజ్లింగ్‌ను ప్రకటించాలని బజరంగ్‌ డిమాండ్‌ చేశాడు.  ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన రెజ్లర్లకు క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ జాతీయ క్రీడగా రెజ్లింగ్‌ చేయాలనే ఆలోచన చేయగా దానికి బజరంగ్‌ మద్దతు తెలిపాడు. ప్రపంచ వేదికల మీద గత కొంత కాలంగా రెజ్లింగ్‌ భారత్‌కు పతకాలు అందిస్తూ వస్తోంది. అటువంటి రెజ్లింగ్‌ను జాతీయ క్రీడగా చేయడం సరైనదే అని బజరంగ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే దీనిపై ఆచితూచి స్పందించిన క్రీడల మంత్రి తనకు అన్ని క్రీడలు సమానమేనని, వాటి అభివృద్ధికి దోహదపడతానని అన్నారు.

నగదు పురస్కారాల ప్రదానం...
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ఐదుగురు భారత రెజ్లర్లను కిరణ్‌ రిజిజు నగదుతో సత్కరించారు. రజతం గెలిచిన దీపక్‌ పూనియాకు రూ.7 లక్షలు, కాంస్యాలు సాధించిన బజరంగ్, వినేశ్‌ ఫొగాట్, రాహుల్‌ అవారే, రవి దహియాలకు తలా రూ.4 లక్షల రూపాయల చెక్‌లను బహూకరించారు.

మరిన్ని వార్తలు