ఏ ఒక్కరిపైనో ఆధారపడలేం 

19 Jul, 2018 00:40 IST|Sakshi

ప్రపంచ కప్‌ నాటికి  సమతూకం సాధించాలి     భారత కెప్టెన్‌ కోహ్లి వ్యాఖ్యలు  

లీడ్స్‌: వచ్చే ఏడాది జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్‌ సమయానికి జట్టులో సమతూకం సాధించాల్సి ఉందని అంటున్నాడు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి.  ‘ఈ తరహా ఫలితాలు మేం ఎక్కడ మెరుగుపడాలో చెబుతాయి. ప్రపంచ కప్‌నకు ముందు మాకొక సమతూకమైన జట్టు, దానితో ఫలితాలు సాధించడం అవసరం. అన్ని విభాగాల్లోనూ రాణించాల్సిందే.  ఏ ఒక్కరి ప్రతిభపైనో ఆధారపడలేం’ అని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే పరాజయం అనంతరం అతడు మాట్లాడాడు.

మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ వైఫల్యంతో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘మ్యాచ్‌లో పరుగుల పరంగా మేం ఏ దశలోనూ ప్రమాణాలు అందుకోలేకపోయాం. 25–30 పరుగులు తక్కువగా చేశాం. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చింది. వారు విజయానికి అర్హులు. అలాంటి జట్టుతో తలపడుతున్నప్పుడు అత్యున్నత స్థాయిలో ఆడాలి’ అని ప్రశంసించాడు.  

>
మరిన్ని వార్తలు