బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజం ఇక్బాల్ ఇకలేరు

18 Jul, 2014 01:56 IST|Sakshi
బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజం ఇక్బాల్ ఇకలేరు

ఎల్బీ స్టేడియం: జాతీయ బాల్ బ్యాడ్మింటన్  మాజీ ఆటగాడు ఎల్.ఎ.ఇక్బాల్ అలీ (78) అనారోగ్యంతో గురువారం కన్ను మూశారు. హైదరాబాదీ క్రీడాకారుడైన ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగిగా పదవీవిరమణ చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ గత నెలలో జరిగిన ఒలింపిక్‌డే రన్‌కు హాజరై క్రీడాస్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సన్మానించారు. పలు జాతీయ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ల్లో సత్తాచాటిన ఆయనను భారత ప్రభుత్వం 1975లో అర్జున అవార్డుతో సత్కరించింది.
 
 కెరీర్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఆయన రాష్ట్ర జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఇక్బాల్ వద్ద శిక్షణ పొందిన రాంబాబు, రాజ్ కుమార్ తదితరులు జాతీయ చాంపియన్లుగా ఎదిగారు. ఇక్బాల్ మృతి పట్ల రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, హైదరాబాద్ బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు సి.హెచ్.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎ.రవీందర్ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు