పరువు పాతాళంలోకి!

26 Mar, 2018 03:24 IST|Sakshi
బాన్‌క్రాఫ్ట్, వార్నర్, స్మిత్‌

ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర దుమారం

‘బాల్‌ ట్యాంపరింగ్‌’పై ఆ దేశ ప్రధాని జోక్యం

కెప్టెన్‌గా స్మిత్, వైస్‌ కెప్టెన్‌గా వార్నర్‌కు తక్షణ ఉద్వాసన

ఇద్దరిపై జీవితకాల నిషేధం విధించే యోచన

స్మిత్‌పై ఐసీసీ ఓ టెస్టు వేటు, 100 శాతం జరిమానా

75 శాతం కోతతో బయటపడ్డ బాన్‌క్రాఫ్ట్‌

అనూహ్యంగా బయటడిన బాల్‌ ట్యాంపరింగ్‌ పెద్ద కుదుపులకే దారి తీస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను సంక్షోభంగా నిలుస్తోంది. స్వదేశీ, విదేశీ మాజీ ఆటగాళ్ల విమర్శల తుఫానులో చిక్కుకుంది. ఏకంగా ఆ దేశ ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బుల్‌ రంగంలోకి దిగేంతగా తీవ్ర స్థాయి దాల్చింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌లను తక్షణమే పదవుల నుంచి తప్పించాలని ఆయన ఆదేశించగా... ఇటువైపు స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌లపై జీవితకాల నిషేధం వంటి మరిన్ని సంచలన నిర్ణయాలకూ ఆస్కారం కనిపిస్తుండగా... పులి మీద పుట్రలా దక్షిణాఫ్రికా చేతిలో మూడో టెస్టులో దారుణ పరాజయం ఆసీస్‌ను మరింత కుంగదీసింది.   

సిడ్నీ/దుబాయ్‌: బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, ఏకంగా దేశ ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బుల్‌ జోక్యం చేసుకోవడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌లను కెప్టెన్, వైస్‌ కెప్టెన్‌ పదవుల నుంచి తప్పించింది. వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించింది.

‘ఈ టెస్టు పూర్తిగా సాగాల్సిన అవసరం ఉంది. స్మిత్, వార్నర్‌లతో చర్చించాం. వైదొలగేందుకు వారు అంగీకరించారు’ అని సీఏ చీఫ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ తెలిపాడు. దీంతోపాటు ట్యాంపరింగ్‌ ఘటనపై అత్యవసర విచారణ జరిపేందుకు సీఏ హెడ్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ లైన్‌ రాయ్, టీమ్‌ ఫెర్ఫార్మెన్స్‌ హెడ్‌ ప్యాట్‌ హోవార్డ్‌లు దక్షిణాఫ్రికా బయల్దేరారు. ‘మాతో సహా ఆస్ట్రేలియన్లంతా సమాధానం కోరుకుంటున్నారు. మా దర్యాప్తులో తేలిన అంశాలను ఎప్పటికప్పుడు ప్రాధాన్యంగా తెలియపరుస్తాం’ అని సదర్లాండ్‌ పేర్కొన్నాడు.


మరోవైపు బాల్‌ ట్యాంపరింగ్‌కు గాను ఆసీస్‌ సారథిపై ఒక టెస్టు నిషేధంతో పాటు వంద శాతం మ్యాచ్‌ ఫీజు కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. నేరుగా ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఓపెనర్‌ బాన్‌క్రాఫ్ట్‌ మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోతతో పాటు, మూడు డి మెరిట్‌ పాయింట్లు ఇచ్చింది. ‘క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే తీవ్ర చర్యలకు పాల్పడిన ఆటగాళ్లకు మద్దతుగా నిలిచినందుకు స్మిత్‌పై కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ 2.2.1 ఆర్టికల్‌ కింద, బంతి ఆకారం మార్చేందుకు ప్రయత్నించి లెవల్‌ 2 నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆర్టికల్‌ 2.2.9, నిబంధన 41.3 కింద బాన్‌క్రాఫ్ట్‌పై ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ ఈ చర్యలు చేపట్టారు.

దీంతో పాటు రెండు సస్పెన్షన్‌ పాయింట్లను ఎదుర్కొన్న స్మిత్‌ తదుపరి టెస్టుకు దూరం కానున్నాడు. అతడి ఖాతాలో నాలుగు డి మెరిట్‌ పాయింట్లు కూడా జమ కానున్నాయి. ‘ట్యాంపరింగ్‌ చేసేలా స్వయంగా ఆస్ట్రేలియా జట్టు నాయకత్వమే ప్రోత్సహించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఇది తీవ్రమైన అంశం. కెప్టెన్‌గా స్మిత్‌ దీనికి పూర్తిగా బాధ్యుడు. సస్పెన్షనే సరైనది’ అని రిచర్డ్‌సన్‌ స్పష్టం చేశారు. ఈ సిరీస్‌లో చోటుచేసుకున్న దూషణలు, అంపైర్ల నిర్ణయాలపై నిరసన, ప్రేక్షకుల అతి వంటి వాటిని ఇకపై నివారించే దిశగా  ఐసీసీ చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు. సభ్య దేశాలు కూడా క్రికెట్‌ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రయత్నించాలని కోరాడు.

ఆలోచించాకే నిర్ణయం...
న్యూఢిల్లీ: బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం నేపథ్యంలో  స్మిత్, వార్నర్‌ల ఐపీఎల్‌ భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా తెలిపారు. ఆస్ట్రేలియా బోర్డు, ఐసీసీ చర్యలు చేపట్టినప్పటికీ... బీసీసీఐ ఈ విషయమై ఎటువంటి ఆలోచన చేయడం లేదని శుక్లా వివరించారు. బీసీసీఐతో సమాలోచన చేశాకే స్మిత్‌పై తమ నిర్ణయం వెలువరిస్తామని రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ తెలిపింది. వార్నర్‌పై మాత్రం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్పందించలేదు.

స్మిత్, వార్నర్‌ వంటి కీలక ఆటగాళ్లను ఒక్క ఘటనతో దూరం పెట్టలేమని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్‌ ట్యాంపరింగ్‌ చేశారనే వార్త విని షాక్‌కు గురయ్యా. ఆదర్శంగా నిలవాల్సిన వారు మోసపూరిత చర్యలకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్‌ డేవిడ్‌ పీవెర్‌తో ఈ విషయంపై మాట్లాడాను. స్మిత్, వార్నర్‌లను వారి బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించాను.
–టర్న్‌బుల్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి

నిజాయతీగా చెప్పాలంటే గత 24 గంటలు మాకెంతో భారంగా గడిచాయి. మా అభిమానులందరినీ ఈ సందర్భంగా నేను క్షమాపణలు కోరుతున్నాను. మా నుంచి వారు ఇలాంటి ప్రదర్శనను ఆశించలేదు.
–టిమ్‌ పైన్, ఆసీస్‌ తాత్కాలిక సారథి

స్మిత్‌ చేసింది చాలా చాలా పెద్ద తప్పే.  సరైన వ్యక్తులు పిలిస్తే ఆస్ట్రేలియా జట్టులోకి మళ్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.
–మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌

ఎంతవాడుగానీ...
 నైతికత లేకుంటే పతనమే!
స్టీవ్‌ స్మిత్‌ ఉదంతం చెబుతున్నదిదే  

అతడు ఎనిమిదేళ్ల క్రితం టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసింది ఒక స్పిన్నర్‌గా. బ్యాటింగ్‌కు దిగింది 8వ స్థానంలో. కానీ, తర్వాత ఎంతో మెరుగయ్యాడు. ఓపెనింగ్‌తో పాటు 3, 4, 5 ఇలా పలు స్థానాల్లో బ్యాటింగ్‌ చేశాడు. కీలక ఆటగాడిగా ఎదగడమే కాదు... కెప్టెన్‌ కూడా అయ్యాడు. సంధి దశలో ఉన్న జట్టును ముందుండి నడిపించాడు. టెస్టుల్లో నంబర్‌వన్‌గానూ నిలిచాడు. 64 టెస్టులు ముగిసేసరికి ఇప్పుడతడి సగటు 61.37. అయినా... ఏం లాభం? నైతికత అనే ఒక్క లక్షణం లేకపోవడంతో నాయకుడు కాస్తా ప్రతినాయకుడిలా కనిపిస్తున్నాడు. అతడే ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌ స్మిత్‌.

ఒక్కో మెట్టు ఎక్కి...
క్రీజులో చిత్రవిచిత్ర స్టాన్స్, మెరుపు ఫీల్డింగ్‌తో పాటు అచ్చం బొమ్మలాంటి ముఖంతో తొలినాళ్లలో స్మిత్‌ కొంత ప్రత్యేకంగా కనిపించే వాడు. స్పిన్నర్‌గా అడుగుపెట్టినా పేరుగాంచింది మాత్రం బ్యాట్స్‌మన్‌గానే. అడ్డదిడ్డమైన షాట్లతో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి, ప్రపంచ వ్యాప్తంగా పరుగులు రాబడుతూ ఆసీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత అత్యధిక సగటు ఉన్న ఆటగాడిగా ఎదిగాడు. ఇలా కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎంతటి పేరు సంపాదించాడో, దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌తో అంతటి చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. తన ప్రతిష్ఠకు తానే మచ్చ తెచ్చుకున్నాడు.

గతేడాది బెంగళూరులో భారత్‌తో టెస్టు సందర్భంగా డీఆర్‌ఎస్‌ కోరేందుకు జట్టు సభ్యులున్న బాల్కనీ వైపు చూసి స్మిత్‌ అప్పట్లోనే వివాదాస్పదమయ్యాడు. మతి చెడి అలా చేశానని తర్వాత ఒప్పుకున్నాడు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌తో టెస్టులోనూ అనుచిత ప్రవర్తనతో జరిమానాకు గురయ్యాడు. ఆ సందర్భంలో ‘నాయకుడిగా నేనింకా ఎదగాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి’ అని చెప్పాడు. తర్వాత కూడా అండర్సన్, రబడ వంటి బౌలర్లతో వాగ్యుద్ధానికి దిగాడు. ఇప్పుడు ఏకంగా ట్యాంపరింగ్‌తో పెద్ద తప్పే చేశాడు.

అంత అవసరం ఏమొచ్చింది...
దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్‌ 1–1తో ఉంది. జరుగుతున్నది మూడో టెస్టు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్‌ పోరాడి ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. సఫారీల నుంచి రెండో ఇన్నింగ్స్‌లో ప్రతిఘటన ఎదురవుతోంది. మరీ బెదిరిపోవాల్సిన పనిలేదు. తమ రెండో ఇన్నింగ్స్‌లో దానికి బదులివ్వొచ్చు. అప్పటికీ విఫలమైతే టెస్టు చేజారుతుంది అంతే! లోపాలు సరిచేసుకుని చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయొచ్చు. ఆసీస్‌లాంటి జట్టుకు ఇదేమంత కష్టమూ కాదు. కానీ తప్పు దారిలో ఆలోచించి దోషిగా నిలబడ్డాడు. పైగా జట్టంతా తీసుకున్న నిర్ణయమంటూ అందరికీ ఆపాదించాడు. కొత్త కుర్రాడు బాన్‌క్రాఫ్ట్‌ సహా, నేరుగా ప్రమేయం లేని వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ భవిష్యత్తునూ బలి చేశాడు.  

జీవితకాలం వెంటాడే తప్పు...
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్మిత్‌ ఆల్‌టైమ్‌ రెండో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు (945) సాధించి ఉండవచ్చుగాక, చరిత్రలో రెండో అత్యధిక సగటుతో కెరీర్‌ ముగించొచ్చుగాక... ఇలాంటి ఘనతలు ఇంకెన్ని తన ఖాతాలో ఉన్నా బాల్‌ ట్యాంపరింగ్‌ అతడిని జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. ఒక మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలా, ఒక అండర్‌ ఆర్మ్‌ బౌలింగ్‌లా ఇది చరిత్రలో నిలిచిపోతుంది.

–సాక్షి క్రీడా విభాగం

మరిన్ని వార్తలు