‘బెంగ’ళూరుకు గేల్ గుబులు!

13 Apr, 2018 13:04 IST|Sakshi
పంజాబ్ ఆటగాళ్లతో క్రిస్ గేల్

సాక్షి, బెంగళూరు : పొట్టి ఫార్మాట్ టీ20 పేరు చెబితే గుర్తుకొచ్చే క్రికెటర్లలో వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ ఒకరు. అయితే ఐపీఎల్ 11 సీజన్లో మాత్రం అతడికి చేదు అనుభవం ఎదురైంది. రెండుసార్లు వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిన గేల్‌ను చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీసుకుంది. అయినా ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడికి అవకాశం ఇవ్వలేదు. కానీ నేడు (శుక్రవారం) తమతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ తమ ఆయుధంగా గేల్‌ను తీసుకొస్తుందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో గుబులు మొదలైంది. గేల్ రూపంలో ప్రమాదం వస్తే రెండో మ్యాచ్‌లోనూ ఓటమి దూరం అవుతుందా అన్న అనుమానం బెంగళూరుకు లేకపోలేదు.

అసలే తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమి చవిచూసిన బెంగళూరు రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై నెగ్గి విజయాల ఖాతా తెరవాలని భావిస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న నేటి మ్యాచ్‌లో గేల్ ఆడే అవకాశాలున్నాయని, అతడిని కట్టడి చేసేందుకు కోహ్లీ సేన వ్యూహాలు రచిస్తోంది. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితులు గేల్‌కు బాగా తెలుసు. 2011 నుంచి బెంగళూరుకు ఆడిన గేల్‌ను ఈ సీజన్లో ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. అయితే 2013 సీజన్లో గేల్ ఇక్కడి మైదానంలో వ్యక్తిగత అత్యధిక పరుగులు (175) సాధించాడు. 

క్రిస్ గేల్‌ను పంజాబ్ ఈ మ్యాచ్‌లోనూ తీసుకోదని బెంగళూరు కోచ్ డానియల్ వెటోరి అభిప్రాయపడ్డాడు. అయితే చిన్నస్వామి స్టేడియంలో  గేల్ నిరూపించుకోవాల్సిందేమీ లేదన్నాడు. ఒకవేళ గేల్‌ను పంజాబ్ ఆడించినా.. అతడిని కట్టడి చేసేందుకు తమ వద్ద గేమ్ ప్లాన్ ఉందన్నాడు వెటోరి. దీంతో పంజాబ్ జట్టు ఆడిస్తుందో.. లేదో తెలియని గేల్‌ విషయంలో బెంగళూరు ఆందోళన చెందుతుందనడంలో ఈ విధ్వంసక ఆటగాడి పేరు ప్రస్తావించడమే నిదర్శనంగా భావించవచ్చు. 

వచ్చే మూడేళ్లను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసిందని, అందుకే క్రిస్ గేల్‌ను బెంగళూరు యాజమాన్యం తీసుకోలేదని కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో బెంగళూరుకు 85 మ్యాచ్‌లాడిన క్రిస్ గేల్ 3000కు పైగా పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 151.20 గా ఉంది.

మరిన్ని వార్తలు