సెమీస్‌లో బెంగళూరు రాప్టర్స్‌

7 Feb, 2020 01:32 IST|Sakshi

ఆఖరి పోరులో వారియర్స్‌పై జయభేరి

నేడు జరిగే తొలి సెమీఫైనల్లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో చెన్నై సూపర్‌స్టార్స్‌ జట్టు; శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో పుణే సెవెన్‌ ఏసెస్‌తో బెంగళూరు రాప్టర్స్‌ జట్టు తలపడతాయి. ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది

సాక్షి, హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు రాప్టర్స్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 5–0తో అవధ్‌ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. గెలిచిన జట్టే ముందంజ వేసే ఈ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ తై జు యింగ్, బ్రైస్‌ లెవెర్‌డెజ్‌ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టారు. ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్‌ నెగ్గడంతో రాప్టర్స్‌ రెండు ‘ట్రంప్‌’ మ్యాచ్‌ల్లోనూ గెలిచి సెమీస్‌ దారిని సులభతరం చేసుకుంది. ఇప్పటికే నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్, చెన్నై సూపర్‌స్టార్స్, పుణే సెవెన్‌ ఏసెస్‌ సెమీస్‌ చేరాయి.

పురుషుల డబుల్స్‌తో మొదలైన ఈ పోరులో అరుణ్‌ జార్జి–రియాన్‌ అగుంగ్‌ సపుట్రో (రాప్టర్స్‌) జోడీ 15–14, 7–15, 11–15తో సంగ్‌ హ్యూన్‌–షిన్‌ బెక్‌ చియోల్‌ (అవధ్‌) ద్వయం చేతిలో కంగుతింది. అయితే అవధ్‌ ‘ట్రంప్‌’ పోరులో జయరామ్‌ 9–15, 9–15తో లెవెర్‌డెజ్‌ (రాప్టర్స్‌) చేతిలో ఓడిపోవడంతో వచ్చిన పాయింట్‌ కూడా చేజారింది. మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్‌ (రాప్టర్స్‌) 15–12, 15–12తో బీవెన్‌ జాంగ్‌ (అవధ్‌)పై నెగ్గింది. అనంతరం రెండో పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్‌’గా ఎంచుకోగా సాయిప్రణీత్‌ (రాప్టర్స్‌) 15–11, 15–13తో విన్సెంట్‌ (అవధ్‌)ను ఓడించి జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే 4–0తో అవధ్‌పై గెలుపును ఖాయం చేసుకుంది. ఇక ఆఖరి మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోరులో చన్‌ పెంగ్‌ సూన్‌– ఇయోమ్‌ హి వోన్‌ (రాప్టర్స్‌) జోడీ 7–15, 15–12, 15–11తో సంగ్‌ హ్యూన్‌–క్రిస్టీనా పెడర్సన్‌ (అవధ్‌) జంటపై గెలిచింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా