బంగ్లా వల్ల కాలేదు..!

15 Nov, 2019 03:03 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో 150కే ఆలౌట్‌

కుప్పకూల్చిన భారత బౌలర్లు

షమీ సూపర్‌ బౌలింగ్‌

మొదటి రోజు భారత్‌ 86/1

దక్షిణాఫ్రికా ఇటీవలి భారత్‌తో సిరీస్‌లో మూడు టాస్‌లు ఓడిపోయిన తర్వాత ‘ఒక్క టాస్‌ అయినా గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసి ఉంటే’ ఫలితం భిన్నంగా ఉండేదేమో అంటూ డు ప్లెసిస్‌ ఆవేదనగా ఒక వ్యాఖ్య చేశాడు. కానీ విదేశీ జట్లు భారత గడ్డపై టాస్‌ మాత్రమే గెలిస్తే సరిపోదని, ప్రత్యర్థిని ఎదుర్కోగల సత్తా కూడా కొంత ఉండాలని మళ్లీ మళ్లీ రుజువైంది. కీలకమైన టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగినా... దానిని ఉపయోగించుకోవడంలో బంగ్లాదేశ్‌ విఫలమైంది. ముగ్గురు పేసర్లు ఒక వైపు, అశ్విన్‌ మరో వైపు చెలరేగుతుండగా ఏమీ చేయలేక చేతులెత్తేసి 150 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రోహిత్‌ త్వరగానే అవుటైనా... పుజారా, మయాంక్‌ కలిసి తమదైన శైలిలో టీమిండియా భారీ స్కోరుకు బాట వేశారు.  షమీ అద్భుత బౌలింగే  తొలి రోజు ఆటలో హైలైట్‌గా నిలిచిన అంశం.

ఇండోర్‌: భారత్‌తో టి20 సిరీస్‌లో ఎంతో కొంత పోరాటం కనబర్చిన బంగ్లాదేశ్‌ టెస్టుల్లోకి వచ్చేసరికి ‘తమ స్థాయి’ని ప్రదర్శించింది. తొలి టెస్టు మొదటి రోజు గురువారం పేలవమైన ఆటతో ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (105 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ (80 బంతుల్లో 37; 6 ఫోర్లు) కొంత పోరాడి నాలుగో వికెట్‌కు 68 పరుగులు జత చేయడం మినహా మిగతా జట్టంతా విఫలమైంది. షమీ 3 వికెట్లు పడగొట్టగా...ఇషాంత్, ఉమేశ్, అశ్విన్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ ఆట ముగిసే సమయానికి రోహిత్‌ శర్మ (6) వికెట్‌ కోల్పోయి 86 పరుగులు చేసింది. చతేశ్వర్‌ పుజారా (61 బంతుల్లో 43 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌ (81 బంతుల్లో 37 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ మరో 64 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.

ముగ్గురూ తలా ఒక వికెట్‌... 
ఊహించినట్లుగానే పిచ్‌ ఆరంభంలో పేస్‌ బౌలింగ్‌కు అనుకూలించింది. ఇలాంటి స్థితిలో భారత త్రయాన్ని ఎదుర్కోవడం బంగ్లా బ్యాట్స్‌మెన్‌ వల్ల కాలేదు. ఓపెనర్‌ కైస్‌ (6)ను అవుట్‌ చేసి ప్రత్యర్థి పతనానికి ఉమేశ్‌ శ్రీకారం చుట్టగా, అదే స్కోరు వద్ద మరో ఓపెనర్‌ షాద్‌మన్‌ (6)ను ఇషాంత్‌ పెవిలియన్‌ పంపించాడు. ఒకసారి డీఆర్‌ఎస్‌తో బతికిపోయినా, ఆ తర్వాత మిథున్‌ (13) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. షమీ వేసిన బంతికి వికెట్లు ముందు దొరికిపోయిన అతను రివ్యూ కోరలేదు.

కీలక భాగస్వామ్యం... 
స్కోరు 31/3నుంచి బంగ్లాను ఆదుకునేందుకు కెప్టెన్‌ మోమినుల్, సీనియర్‌ ముష్ఫికర్‌ కలిసి ప్రయత్నించారు. మంచి సమన్వయంతో ఆడిన వీరిద్దరు కొన్ని చూడచక్కటి షాట్లు కూడా కొట్టారు. ఈ క్రమంలో మధ్యలో కొంత అదృష్టం కూడా బంగ్లా జోడీకి కలిసొచ్చింది. లంచ్‌ విరామం తర్వాత అశ్విన్‌ వేసిన ఓవర్లో వరుస బంతుల్లో ముష్ఫికర్‌ 6, 4 కొట్టడంతో భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇద్దరు సీనియర్లు స్వేచ్ఛగా ఆడటం చూస్తే బంగ్లా మెరుగైన స్కోరు దిశగా సాగుతున్నట్లు అనిపించింది.

టీమ్‌ హ్యాట్రిక్‌... 
కీలక సమయంలో నాలుగో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీసి అశ్విన్‌ భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. అశ్విన్‌ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి వదిలేసిన మోమినుల్‌ క్లీన్‌బౌల్డయ్యాడు. భారత గడ్డపై అశ్విన్‌కు ఇది 250వ వికెట్‌ కావడం విశేషం. కొద్ది సేపటికే అశ్విన్‌ బౌలింగ్‌లోనే స్వీప్‌కు ప్రయత్నించి మహ్ముదుల్లా (10) కూడా బౌల్డయ్యాడు. ఆ తర్వాత బంగ్లా పతనం వేగంగా సాగింది. 10 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 5 వికెట్లు కోల్పోయింది. వరుస బంతుల్లో ముష్ఫికర్, మెహదీ హసన్‌ (0)లను షమీ అవుట్‌ చేశాక అంపైర్లు టీ విరామం ప్రకటించారు. ముష్ఫికర్‌ను షమీ అద్భుత బంతితో బౌల్డ్‌ చేసిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. విరామంనుంచి తిరిగొచ్చాక తొలి బంతికే లిటన్‌ దాస్‌ (21)ను ఇషాంత్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ ‘టీమ్‌ హ్యాట్రిక్‌’ పూర్తి చేసుకుంది. జడేజా చక్కటి ఫీల్డింగ్‌కు తైజుల్‌ (1) రనౌట్‌ కాగా, ఇబాదత్‌ (2)ను బౌల్డ్‌ చేసి ఉమేశ్‌ ప్రత్యర్థి జట్టు ఆట ముగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై బంగ్లాకు ఇది రెండో అత్యల్ప స్కోరు.

రోహిత్‌ విఫలం... 
గత సిరీస్‌ హీరో రోహిత్‌ శర్మ బంగ్లాతో టెస్టులో అదే జోరును కొనసాగించలేకపోయాడు. జాయెద్‌ బంతిని డ్రైవ్‌ చేయబోయి కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో రోహిత్‌ అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత మయాంక్, పుజారా ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. బంగ్లా బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ వీరిద్దరు వేగంగా పరుగులు జోడించారు. ఒక దశలో పుజారా ఎనిమిది బంతుల వ్యవధిలో 5 ఫోర్లు బాదడం విశేషం!  32 పరుగుల వద్ద మయాంక్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో కైస్‌ వదిలేయడం భారత్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత మరో వికెట్‌ తీయడంలో బంగ్లా విఫలమైంది.

250 స్వదేశంలో అశ్విన్‌ వికెట్ల సంఖ్య. తన 42వ టెస్టులో అతను ఈ మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కుంబ్లే (350), హర్భజన్‌ (265) మాత్రమే అశ్విన్‌ కంటే ముందున్నారు.

నాలుగు క్యాచ్‌లు నేలపాలు! 
బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేసినా మొదటి రోజు భారత ఫీల్డింగ్‌లో భారీ వైఫల్యం కనిపించింది. ఏకంగా నాలుగు క్యాచ్‌లు అదీ స్లిప్‌లోనే చేజారాయి. వీటిలో మూడు క్యాచ్‌లు రహానే వదిలేయగా, ఒక క్యాచ్‌ను కోహ్లి వదిలేశాడు. అశ్విన్‌ బౌలింగ్‌లోనే ఇది మూడు సార్లు జరగ్గా, ఉమేశ్‌ బౌలింగ్‌లో ఒక అవకాశం చేజారింది. ముష్ఫికర్‌ మూడు సార్లు (3, 14, 34 పరుగుల వద్ద) బతికిపోగా,  మరోసారి మహ్ముదుల్లాకు (7 పరుగుల వద్ద) లైఫ్‌ లభించింది.

స్కోరు వివరాలు
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: షాద్‌మన్‌ (సి) సాహా (బి) ఇషాంత్‌ 6; కైస్‌ (సి) రహానే (బి) ఉమేశ్‌ 6; మోమినుల్‌ (బి) అశ్విన్‌ 37; మిథున్‌ (ఎల్బీ) (బి) షమీ 13; ముష్ఫికర్‌ (బి) షమీ 43; మహ్ముదుల్లా (బి) అశ్విన్‌ 10; లిటన్‌ దాస్‌ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 21; మెహదీ హసన్‌ (ఎల్బీ) (బి) షమీ 0; తైజుల్‌ (రనౌట్‌) 1; జాయెద్‌ (నాటౌట్‌) 7; ఇబాదత్‌ (బి) ఉమేశ్‌ 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (58.3 ఓవర్లలో ఆలౌట్‌) 150. 
వికెట్ల పతనం: 1–12; 2–12; 3–31; 4–99; 5–115; 6–140; 7–140; 8–140; 9–148; 10–150. 
బౌలింగ్‌: ఇషాంత్‌ 12–6–20–2; ఉమేశ్‌ 14.3–3–47–2; షమీ 13–5–27–3; అశ్విన్‌ 16–1–43–2; జడేజా 3–0–10–0.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (బ్యాటింగ్‌) 37; రోహిత్‌ (సి) లిటన్‌ దాస్‌ (బి) జాయెద్‌ 6; పుజారా (బ్యాటింగ్‌) 43; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (26 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 86. 
వికెట్ల పతనం: 1–14. 
బౌలింగ్‌: ఇబాదత్‌ 11–2–32–0; అబూ జాయెద్‌ 8–0–21–1; తైజుల్‌ 7–0–33–0.

తొలి సెషన్‌ 
ఓవర్లు: 26, పరుగులు: 63, వికెట్లు: 3 (బంగ్లాదేశ్‌) 
రెండో సెషన్‌ 
ఓవర్లు: 28, పరుగులు: 77, వికెట్లు: 4 (బంగ్లాదేశ్‌) 
మూడో సెషన్‌ 
ఓవర్లు: 4.1, పరుగులు: 10, వికెట్లు: 3  (బంగ్లాదేశ్‌) 
ఓవర్లు: 26, పరుగులు: 86, వికెట్లు: 1 (భారత్‌)

మరిన్ని వార్తలు