బంగ్లా క్రికెటర్ అరుదైన ఘనత

15 Oct, 2017 17:50 IST|Sakshi

కింబర్లీ : బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో దక్షిణాఫ్రికా జట్టుపై సెంచరీ చేసిన తొలి బంగ్లా బ్యాట్స్‌మెన్‌గా రహీమ్ రికార్డు నెలకొల్పాడు. సఫారీలతో జరుగుతున్న తొలి వన్డేలో రహీమ్ ఈ ఫీట్ తన ఖాతాలో వేసుకున్నాడు. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది.

ఈ క్రమంలో 108 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ముష్ఫికర్ సెంచరీ చేశాడు. రబాడా వేసిన ఇన్నింగ్స్ 46 ఓవర్లో మూడో బంతికి రెండు పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టుపై తొలి వన్డే శతకం చేసిన తొలి బంగ్లా క్రికెటర్‌గా ముష్ఫికర్ నిలిచాడు. గతంలో సౌమ్య సర్కార్ చేసిన 90 పరుగులే వన్డేల్లో దక్షిణాఫ్రికా జట్టుపై బంగ్లా క్రికెటర్ చేసిన అత్యుత్తమ స్కోరు. ఓవైపు సఫారీ సంచలనం రబాడా బంతితో నిప్పులు చెరుగుతున్నా ముష్ఫికర్ మాత్రం చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ బంగ్లా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ముష్ఫికర్ అజేయ శతకం (116 బంతుల్లో 110 నాటౌట్: 11 ఫోర్లు, 2 సిక్సర్లు)తో నిలవడంతో బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు సఫారీల ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది.

బంగ్లా ఆటగాళ్లలో ఓపెనర్ ఇమ్రుల్ కయోస్(31), షకీబ్ అల్ హసన్ (29), మహ్మదుల్లా(26) పరవాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో రబాడా నాలుగు వికెట్లతో చెలరేగగా, ప్రిటోరియస్ 2 వికెట్లు తీశాడు. ఇమ్రాన్ తాహిర్‌కు ఒక్క వికెట్ దక్కింది.

మరిన్ని వార్తలు