భళారే బంగ్లా!

18 Jun, 2019 05:14 IST|Sakshi

322 పరుగుల లక్ష్యం...41.3 ఓవర్లలోనే ఉఫ్‌

షకీబ్‌ వీరోచిత సెంచరీ

లిటన్‌ దాస్‌ మెరుపు ఇన్నింగ్స్‌

వెస్టిండీస్‌కు అనూహ్య పరాజయం

ఐర్లాండ్‌లో ఇటీవల జరిగిన ముక్కోణపు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ మూడుసార్లు విండీస్‌ను ఓడించింది. అప్పుడు గేల్, రసెల్‌ లేరు కాబట్టే గెలిచారని అన్నారు. మరిప్పుడు  ఆ విధ్వంసకారులున్న జట్టును... 300 పైచిలుకు లక్ష్యాన్ని 41.3 ఓవర్లలోనే ఛేదించి మరీ బంగ్లా సంచలన విజయం సాధించింది. అందుకేనేమో ఈ టోర్నీలో బంగ్లా కెప్టెన్‌ మొర్తజా దక్షిణాఫ్రికాను ఓడించినపుడే చెప్పాడు ‘ఇక మేం గెలిస్తే సంచలనం కానేకాదు’ అని ఇప్పుడీ ఫలితం చూస్తుంటే నిజమేననిపిస్తోంది..!  

టాంటన్‌: ప్రపంచకప్‌లోనూ వెస్టిండీస్‌పై బంగ్లా పంజా విసిరింది. ఎదురైంది పటిష్టమైన ప్రత్యర్థే అయినా... ఎదురుగా ఉన్నది భారీ స్కోరే అయినా... బంగ్లాదేశ్‌ చకచకా ఛేదించింది. అది కూడా 8.3 ఓవర్లు మిగిల్చి మరీ విండీస్‌ భరతం పట్టింది. ఈ మెగా ఈవెంట్‌లోనే అసాధారణ ఫామ్‌లో ఉన్న షకీబ్‌ అల్‌ హసన్‌ (99 బంతుల్లో 124 నాటౌట్‌; 16 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించేదాకా పోరాడాడు. అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన లిటన్‌ దాస్‌ (69 బంతుల్లో 94 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈ గెలుపులో వాటా దక్కించుకున్నాడు.

దీంతో విండీస్‌పై బంగ్లా 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మొదట వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీస్కోరు చేసింది. షై హోప్‌ (121 బంతుల్లో 96; 4 ఫోర్లు, 1 సిక్స్‌), లూయిస్‌ (67 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (26 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, ముస్తఫిజుర్‌ రహ్మాన్‌ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ 41.3 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. అజేయ సెంచరీతోపాటు రెండు వికెట్లు కూడా తీసిన షకీబ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

హోప్‌ సెంచరీ మిస్‌...
టాస్‌ నెగ్గిన బంగ్లా బౌలింగ్‌ ఎంచుకుంది. ఓపెనింగ్‌ భాగస్వామ్యం గేల్‌ (13 బంతుల్లో 0)తో విఫలమైనా... మరో ఓపెనర్‌ లూయిస్, షై హోప్‌ ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచే భాగస్వా మ్యాన్ని నెలకొల్పారు. 24 ఓవర్లపాటు బంగ్లా బౌలర్లకు కొరకరాని కొయ్యలయ్యారు. ఈ క్రమంలో లూయిస్‌ 58 బంతుల్లో... తర్వాత హోప్‌ 75 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించాక లూయిస్‌ను షకీబ్‌ ఔట్‌ చేశాడు. దీంతో హోప్‌కు  పూరన్‌ (30 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్‌) జతయ్యాడు. క్రీజులో పాతుకుపోతున్న దశలో పూరన్‌ను షకీబే పెవిలియన్‌ చేర్చాడు. రసెల్‌ (0) డకౌటైనా... హెట్‌మైర్‌ విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. కెప్టెన్‌ హోల్డర్‌ (15 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో లిటన్‌ దాస్‌ క్యాచ్‌ పట్టడంతో హోప్‌ నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.  

ధనాధన్‌ ఛేదన...
వెస్టిండీస్‌ బౌలింగ్‌ పరంగా చూస్తే 322 పరుగుల లక్ష్యం కష్టతరమైందే! కానీ ప్రత్యర్థిపై ఇటీవలి రికార్డు, షకీబ్‌ అల్‌ హసన్‌ వరల్డ్‌కప్‌ ఫామ్‌ అద్భుతంగా ఉండటంతో సీన్‌ మారిపోయింది. దీనికి తగ్గట్లుగానే ఓపెనర్లు సౌమ్య సర్కార్‌ (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తమీమ్‌ ఇక్బాల్‌ (53 బంతుల్లో 48; 6 ఫోర్లు) బీజం వేశారు. తొలి వికెట్‌కు చకచకా 52 పరుగులు జోడించారు. సర్కార్‌ ఆట ముగిశాక వచ్చిన షకీబ్‌ తన జోరు కొనసాగించాడు. రన్‌రేట్‌ పడిపోకుండా తమీమ్, షకీబ్‌ జోడీ జాగ్రత్త పడింది. దీంతో 13.5 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులు చేరింది. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాక తమీమ్‌ రనౌటయ్యాడు. ముష్ఫికర్‌ (1) విఫలమయ్యాడు.

అప్పటికి 19 ఓవర్లలో బంగ్లాదేశ్‌ జట్టు స్కోరు 133/3.  బంగ్లాదేశ్‌కు గెలిచేందుకు 189 పరుగులు కావాలి. మిథున్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన లిటన్‌ దాస్‌... షకీబ్‌కు జతయ్యాడు. ఇద్దరు టాంటన్‌లో ఠారెత్తించారు. చూస్తుండగానే 30 ఓవర్లకంటే ముందే జట్టు స్కోరు 200 (29 ఓవర్లలో) పరుగులు దాటింది. షకీబ్‌ 83 బంతుల్లో శతకం సాధించాడు. ఈ టోర్నీలో అతనికిది రెండో సెంచరీ. లిటన్‌ దాస్‌ 43 బం తుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. గాబ్రియెల్‌ వేసిన 38వ ఓవర్లో లిటన్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టాడు. షకీబ్‌ బౌండరీ బాదడంతో ఈ ఓవర్లోనే 24 పరుగులొచ్చాయి. ఈ ఓవర్‌కు ముందు 79 బంతుల్లో 52 పరుగులుగా వున్న లక్ష్యం కాస్తా 72 బం తుల్లో 28 పరుగులుగా మారిపోయింది. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించి షకీబ్, లిటన్‌ బంగ్లాకు సంచలన విజయాన్ని అందించారు.
  
స్కోరు వివరాలు
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) రహీమ్‌ (బి) సైఫుద్దీన్‌ 0; లూయిస్‌ (సి) సబ్‌–షబ్బీర్‌ (బి) షకీబ్‌ 70; హోప్‌ (సి) లిటన్‌ (బి) ముస్తఫిజుర్‌ 96; పూరన్‌ (సి) సర్కార్‌ (బి) షకీబ్‌ 25; హెట్‌మైర్‌  (సి) తమీమ్‌ (బి) ముస్తఫిజుర్‌ 50; రసెల్‌ (సి) రహీమ్‌ (బి) ముస్తఫిజుర్‌ 0; హోల్డర్‌ (సి) మహ్ముదుల్లా (బి) సైఫుద్దీన్‌ 33; బ్రావో (బి) సైఫుద్దీన్‌ 19; థామస్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 321.

వికెట్ల పతనం: 1–6, 2–122, 3–159, 4–242, 5–243, 6–282, 7–297, 8–321.

బౌలింగ్‌: మొర్తజా 8–1–37–0, సైఫుద్దీన్‌ 10–1–72–3, ముస్తఫిజుర్‌ 9–0–59–3, మెహిదీ హసన్‌ 9–0–57–0, మొసద్దిక్‌ 6–0–36–0, షకీబ్‌ 8–0–54–2.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తమీమ్‌ (రనౌట్‌) 48; సౌమ్య సర్కార్‌ (సి) గేల్‌ (బి) రసెల్‌ 29; షకీబ్‌ (నాటౌట్‌) 124; ముష్ఫికర్‌ (సి) హోప్‌ (బి) థామస్‌ 1; లిటన్‌ దాస్‌ (నాటౌట్‌) 94; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (41.3 ఓవర్లలో 3 వికెట్లకు) 322. 

వికెట్ల పతనం: 1–52, 2–121, 3–133. బౌలింగ్‌: కాట్రెల్‌ 10–0–65–0, హోల్డర్‌ 9–0–62–0, రసెల్‌ 6–0–42–1, గాబ్రియెల్‌ 8.3–0–78–0, థామస్‌ 6–0–52–1, గేల్‌ 2–0–22–0.

4 వన్డేల్లో 6 వేల పరుగులు చేసి 250 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడు షకీబ్‌. ఈ జాబితాలో ఆఫ్రిది, కలిస్, జయసూర్య ఉండగా...అందరికంటే తక్కువ మ్యాచ్‌లలో (202) షకీబ్‌ ఈ ఘనత సాధించాడు.  

మరిన్ని వార్తలు