బంగ్లా ఫైనల్ కు... పాక్ ఇంటికి..

2 Mar, 2016 22:30 IST|Sakshi
బంగ్లా ఫైనల్ కు... పాక్ ఇంటికి..

మిర్పూర్: ఆసియా కప్ లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో ఐదు బంతులు ఉండగానే పాక్ నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ఛేదించింది. 19.1 ఓవర్లలో 131 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (48; 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)రాణించడంతో బంగ్లా మరోసారి సంచలనం సృష్టించింది. దీంతో బంగ్లా ఆసియాకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. చివరి రెండు ఓవర్లలో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. 19వ ఓవర్లో సమీ చేసిన తప్పిదాల కారణంగా 15 పరుగులు రాబట్టుకున్నారు. చివరి ఓవర్ తొలి బంతికి మహ్మదుల్లా(22) ఫోర్ కొట్టి బంగ్లా ఆకాంక్షను నెరవేర్చాడు. మొర్తాజా(12) కూడా చివరి వరకు నిలిచి లాంఛనాన్ని పూర్తి చేయడంలో సహకరించాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమీర్ రెండు వికెట్లు తీయగా, ఇర్ఫాన్, ఆఫ్రిది, మాలిక్ ఒక్కో వికెట్ తీశారు.


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. ఆతిథ్య బంగ్లా జట్టుకు 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సర్ఫరాజ్(42 బంతుల్లో, 58 పరుగులు: 5 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధ శతకంతో ఆదుకోవడంతో పాక్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. షోయబ్ మాలిక్(31 బంతుల్లో 41 పరుగులు) కూడా రాణించాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ 12 పరుగులకే జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఆరుఓవర్లకు పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేయడం.. 28 పరుగుల వద్ద నాలుగో వికెట్ రూపంలో ఉమర్ అక్మల్(4) పరుగులకే ఔటవ్వడంతో పాక్ ఆచితూచి ఆడటం మొదలుపెట్టింది. షోయబ్ మాలిక్ ఔటైన తర్వాత ఆ జట్టు బాధ్యతను సర్ఫరాజ్ తనపై వేసుకుని చివర్లో షాట్లు ఆడటంతో పాక్ పోరాడే స్కోరును చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో అమిద్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆరాఫత్ సన్నీ 2, టస్కీన్, మొర్తాజా తలో వికెట్ తీశారు. సౌమ్య సర్కార్‌కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ లభించింది. ఈ నెల 6న ఫైనల్‌లో భారత్, బంగ్లాలు తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు