ఎన్నికల బరిలో బంగ్లా కెప్టెన్‌

13 Nov, 2018 11:14 IST|Sakshi
మష్రఫె మొర్తజా

ఢాకా : బంగ్లాదేశ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ మష్రఫె మొర్తజా రాజకీయ ఇన్నింగ్స్‌ ఆరంభించబోతున్నాడు. వచ్చే నెల బంగ్లాదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో మొర్తజా పోటీ చేస్తున్నట్లు సోమవారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న బంగ్లాదేశ్‌లో మొర్తజాకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. అధికార పార్టీ అయిన అవామీ లీగ్‌ తరుపునే మొర్తజా బరిలోకి దిగుతున్నాడు. రాజకీయాల్లోకి రావాలన్న మొర్తజా నిర్ణయానికి ప్రధాని హసీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవామీ లీగ్ అధికార ప్రతినిధి మహబూబుల్ అలం హనీఫ్ తెలిపారు. మొర్తజా తన సొంత జిల్లా అయిన పశ్చిమ బంగ్లాదేశ్‌లోని నరైలీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఇక రాజకీయాల్లోకి వెళ్లాలన్న క్రికెటర్ల ప్రయత్నాన్ని అడ్డుకోబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అటు రాజకీయాలు, ఇటు కెరీర్‌ను మోర్తాజా బ్యాలెన్స్ చేసుకోగలడని తాము విశ్వసిస్తున్నట్టు బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనుస్ తెలిపారు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన మొర్తజా 2019 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే  వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రాజకీయాల్లోకి రావాలనే అతని నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అభిమానులు మోర్తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ఇక క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే కొత్తకాదు. కానీ వచ్చిన వారంతా రిటైర్మెంట్‌ అనంతరమే రాజకీయ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కానీ మొర్తజా మాత్రం కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడు.

మరిన్ని వార్తలు