క్రికెటర్ల రచ్చ; డ్రెస్సింగ్‌ రూమ్‌ ధ్వంసం

17 Mar, 2018 09:02 IST|Sakshi
ధ్వంసమైన డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు, గ్రౌండ్‌లో బంగ్లా-లంక ప్లేయర్ల వాగ్వాదం

కొలంబో : నిదహస్‌ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తీవ్ర పరిణామాలు జరిగాయి. మ్యాచ్‌ తర్వాత.. ఏకంగా విధ్వంసకాండ చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌ క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

డ్రెస్సింగ్‌ రూమ్‌ ధ్వంసం : మ్యాచ్‌ చివరి ఓవర్లో బంగ్లా-లంక ప్లేయర్లు పరస్పరం వాదులాడుకున్నారు. ఉత్కంఠపోరులో గెలిచిన తర్వాత బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేస్తూ లంకను గేలిచేయత్నం చేశారు. ప్రజెంటేషన్‌ కార్యక్రమం పూర్తైన కొద్దిసేటికే బంగ్లా క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది.. లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఆ రిపోర్టు ఆధారంగా ఐసీసీ చర్యలకు ఉపక్రమించనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది.

అసలేం జరిగింది? ఫైనల్స్‌లో బెర్త్‌ కోసం బంగ్లాతో జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో మరో బంతి మిగిలుండగానే బంగ్లా 160 పరుగులు సాధించి విక్టరీ కొట్టింది. అయితే ఇన్నింగ్స్‌ చివరి(20వ) ఓవర్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. రెండు బంతులు భుజం కంటే ఎత్తులో వెళ్లినా అంపైర్లు నోబాల్‌ ఇవ్వకపోవడంతో బంగ్లా బ్యాట్స్‌మన్‌ అసహనానికి గురయ్యారు. ముస్తఫిజుర్‌ రనౌటైన గ్యాప్‌లో గ్రౌండ్‌లోకి వచ్చిన బంగ్లా సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్లు.. శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగారు. అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పేలోపే కెప్టెన్‌ షకీబ్‌ బౌండరీ దగ్గరకొచ్చి ‘బయటికి వచ్చేయండి..’  అంటూ గట్టిగట్టిగా కేకలు వేశాడు. చివరికి బంగ్లా జట్టు మేనేజర్‌ ఖాలెద్‌ మెహమూద్‌ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్‌ కొనసాగించారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేశారు. మ్యాచ్‌ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి.

మరిన్ని వార్తలు