లిటన్‌ దాస్‌ ఔట్‌పై బంగ్లా ఫ్యాన్స్‌ ఆగ్రహం

29 Sep, 2018 15:14 IST|Sakshi

దుబాయ్‌: ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్‌ టైటిల్‌. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది.

అయితే, ఈ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన బంగ్లా ఓపెనర్ లిటన్‌ దాస్‌(121)ను మూడో అంపైర్‌ స్టంపౌట్‌గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 41వ ఓవర్‌లో కుల్దీప్‌ వేసిన గూగ్లీని ఆడేందుకు ముందుకు వెళ్లిన లిటన్‌ దాస్‌ బంతి మిస్‌ కావడంతో అంతే వేగంగా క్రీజు లైన్‌పై కాలు పెట్టాడు. అప్పటికే ఎంఎస్‌ ధోని చాలా వేగంగా వికెట్లను గిరటేశాడు.

దీంతో నిర్ణయం మూడో అంపైర్‌కు వెళ్లడంతో చాలాసేపు రీప్లేలో చూసినా స్పష్టత కనిపించలేదు. పలు కోణాల్లో  పరిశీలించిన తర్వాత లిటన్‌ దాస్‌ను ఔట్‌గా ప్రకటించారు. ప్రధానంగా లిటన్‌ కాలి వేళ్లు లైన్‌ వెనకభాగంలో ఉన్నట్టు కనిపించకపోవడంతో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు. దీంతో అతన్ని ఔట్‌గా ప్రకటించడంతో టీమిండియా కాస్త ఊపిరిపీల్చుకుంది. అదే సమయంలో థర్డ్‌ అంపైర్‌ బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నిర్ణయం బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఇవ్వకపోవడంపై బంగ్లా ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ నిబంధనను థర్డ్‌ అంపైర్‌ మరచిపోయినట్లు ఉన్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ లాగా మారిందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, ఐసీసీ అంటే బీసీసీఐలాగా మారిందని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. కాలు స్పష్టంగా లైన్‌పై ఉన్నా కూడా ఔట్‌గా ప్రకటించడం దారుణమని మరొక నెటిజన్ తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఇలా లిటన్‌ దాస్‌ ఔట్‌పై ట్విటర్‌లో విమర్శల వెల్లువెత్తుతున్నాయి.

>
మరిన్ని వార్తలు