బంగ్లా ఫ్యాన్స్‌ ప్రతీకారం.. కోహ్లి వెబ్‌సైట్‌ హ్యాక్‌

3 Oct, 2018 12:09 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ ఫ్యాన్స్‌ ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. భారత్‌తో జరిగిన ఆసియాకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ ఆటగాడు లిటన్‌ దాస్‌ను థర్డ్‌ అంపైర్‌ స్టంపౌట్‌గా ప్రకటించడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియా వేదికగా బంగ్లా ఫ్యాన్స్‌ ఏకీపారేశారు. తమ సెంచరీ హీరో లిటన్ దాస్‌ నాటౌట్ అయినా ఔటివ్వడం వల్లే టైటిల్‌ చేజారిందని బంగ్లాదేశ్ అభిమానులు ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా కొందరు ఫ్యాన్స్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అఫిషియల్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు.

అందులో లిటన్ దాస్ అవుటైన ఫొటోలను పోస్ట్ చేశారు. దాన్ని ఎలా ఔటిస్తారో వివరణ ఇవ్వాలంటూ ఐసీసీని నిలదీస్తూ ఓ నోట్‌ను కూడా ఆ వెబ్‌సైట్లో పోస్ట్ చేశారు. క్షమాపణలు చెప్పి, ఆ థర్డ్‌ అంపైర్‌పై చర్యలు తీసుకోవాలని, లేకపోతే వెబ్‌సైట్‌ను మళ్లీ హ్యాక్ చేస్తామని హెచ్చరించారు. ఇది భారతీయులను అవమానించడం కోసం కాదని, తమ జట్టుకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన మాత్రమేనని హ్యాకర్లు తెలిపారు. క్రికెట్లో ప్రతి దేశాన్ని సమానంగా చూడాలని కోరారు. 

ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన లిటన్‌ దాస్‌(121) కుల్దీప్‌ వేసిన గూగ్లీని ఆడేందుకు ముందుకు వెళ్లాడు. బంతి మిస్‌ కావడంతో అంతే వేగంగా క్రీజు లైన్‌పై కాలు పెట్టాడు. కానీ అప్పటికే ఎంఎస్‌ ధోని చాలా వేగంగా వికెట్లను గిరటేశాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించాడు. పలు కోణాల్లో  పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ లిటన్‌ దాస్‌ను ఔట్‌గా ప్రకటించాడు. అదే సమయంలో థర్డ్‌ అంపైర్‌ బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నిర్ణయం బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఇవ్వకపోవడాన్ని బంగ్లా ఫ్యాన్స్ ప్రశ్నిస్తురు.

అసలు బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ నిబంధనను థర్డ్‌ అంపైర్‌ మరచిపోయినట్లు ఉన్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ చివరి బంతి వరకు పోరాడి మూడు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. మరోవైపు అంపైర్‌ తప్పుడు నిర్ణయం వల్లే తమ జట్టు ఓడిపోయిందని బంగ్లా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

కోహ్లి వెబ్‌సైట్‌లో హ్యాకర్స్‌ పోస్ట్‌ చేసిన ఫొటో

మరిన్ని వార్తలు