బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక విజయం

10 Mar, 2018 23:04 IST|Sakshi

కొలంబో : ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్‌ చిరస్మరణీయమైన గెలుపును అందుకుంది. శ్రీలంక నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ సాధించి శభాష్‌ అనిపించింది. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్‌ ఇక్బాల్‌(47;29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌), లిటాన్‌ దాస్‌(43;19 బంతుల్లో 2 ఫోర్లు, 5 ఫోర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరి తర్వాత రహీమ్‌ (72; 35 బంతుల్లో) బౌండరీల మోత మోగించి బంగ్లాదేశ్‌ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.

అంతకుముందు శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లంక  టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంకేయులు ఆది నుంచి దూకుడుగా ఆడారు. శ్రీలంక ఓపెనర్లలో దనుషా గుణతిలకా (26;19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) దాటిగా ఆడే క్రమంలో తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, కుశాల్‌ మెండిస్‌(57;30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్‌ను ఝుళిపించాడు. ఇక ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు కుశాల్‌ పెరీరా (74; 48 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లు‌) చెలరేగి ఆడాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

ఈ క్రమంలోనే కుశాల్‌ ద్వయం 85 పరుగులు జోడించింది. అయితే ఓ దశలో 8 పరుగుల వ్యవధిలో షనకా(0), చండిమాల్‌(2)లు పెవిలియన్‌ చేరడంతో శ్రీలంక తడబాటకు గురైంది. అటు తర్వాత పెరీరాకు జత కలిసిన ఉపుల్‌ తరంగా సమయోచితంగా ఆడాడు. మరొకవైపు పెరీరా బౌండరీలతో ఎదురుదాడి చేస్తూ లంక బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ 55 పరుగులు జోడించిన తర్వాత పెరీరా ఐదో వికెట్‌గా అవుటయ్యాడు. ఇక ఉపుల్‌ తరంగా(32 నాటౌట్‌; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 ఫోర్‌) కడవరకూ క్రీజ్‌లో ఉండి లంక స్కోరును రెండొందలు దాటించాడు. ఇది శ్రీలంకకు టీ 20 ల్లో నాల్గో అత్యుత్తమ స్కోరు. అదే సమయంలో బంగ్లాదేశ్‌పై అత్యధిక టీ 20 స్కోరును సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

మరిన్ని వార్తలు