-

బీపీఎల్ విజేత విక్టోరియన్స్

16 Dec, 2015 01:00 IST|Sakshi

మిర్పూర్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) టైటిల్‌ను కొమిల్లా విక్టోరియన్స్ జట్టు సొంతం చేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో విక్టోరియన్స్ 3 వికెట్ల తేడాతో బారిసల్ బుల్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బారిసల్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్ముదుల్లా (36 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), షహ్‌రియార్ నఫీస్ (31 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రసన్న (19 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

అనంతరం విక్టోరియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమ్రుల్ కైస్ (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం ఇవ్వగా, అహ్మద్ షహజాద్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అయితే 10 ఓవర్లలో 80 పరుగులు చేయాల్సిన దశలో బరిలోకి దిగిన అలోక్ కపాలి (28 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు) చివర్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా బౌండరీలు బాదిన అతను ఆఖరి బంతికి తమ జట్టును గెలిపించాడు.

సమీ వేసిన ఆఖరి ఓవర్లో కొమిల్లా జట్టు 13 పరుగులు రాబట్టి టోర్నీ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 2012, 2013లలో ఢాకా గ్లాడియేటర్స్ టైటిల్ సాధించగా, గత ఏడాది ఈ టోర్నీ జరగలేదు. మూడు సార్లూ టైటిల్ గెలిచిన జట్టుకు సీనియర్ బౌలర్ మొర్తజానే కెప్టెన్  కావడం విశేషం.

మరిన్ని వార్తలు