బంగ్లాదేశ్‌ వచ్చేసింది 

7 Feb, 2020 01:19 IST|Sakshi

తొలిసారి అండర్‌–19 ప్రపంచకప్‌లో ఫైనల్లో ప్రవేశం

సెమీస్‌లో 6 వికెట్లతో న్యూజిలాండ్‌పై గెలుపు

ఆదివారం తుది పోరులో భారత్‌తో ‘ఢీ’

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో అతి పెద్ద ఘనత... ఫిబ్రవరి 6, 2020 ఆ దేశ క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని రోజు... తొలిసారి ఆ జట్టు ఒక అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టోర్నమెంట్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఏ ఫార్మాట్‌లో, ఏ స్థాయిలో కూడా తుది పోరుకు అర్హత సాధించని బంగ్లాదేశ్‌ జట్టు అండర్‌–19 ప్రపంచ కప్‌లో ఆ ఘనతను అందుకుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన భారత్‌తో ఆదివారం జరిగే చివరి సమరానికి సిద్ధమైంది. సెంచరీతో మహ్మూదుల్‌ హసన్, బౌలింగ్‌లో షరీఫుల్‌ ఇస్లామ్‌ ప్రదర్శన బంగ్లాదేశ్‌కు సెమీస్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

భారత్, బంగ్లాదేశ్‌ యువ జట్లు గత సెప్టెంబరులో ఆసియా కప్‌ ఫైనల్లో తలపడ్డాయి. భారత్‌ 106 పరుగులకే కుప్పకూలినా...బంగ్లాదేశ్‌ను 101 పరుగులకే ఆలౌట్‌ చేసి టీమిండియా 5 పరుగులతో విజయాన్నందుకుంది.

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): లీగ్‌ దశ నుంచి అజేయంగా నిలిచిన బంగ్లాదేశ్‌ తమ జోరును సెమీఫైనల్లోనూ కొనసాగించింది. అండర్‌–19 ప్రపంచకప్‌లో తొలిసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ యువ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగా... అనంతరం బంగ్లాదేశ్‌ 44.1 ఓవర్లలో 4 వికెట్లకు 215 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆదివారం ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్‌ తలపడుతుంది.

రాణించిన వీలర్‌... 
బంగ్లా బౌలర్ల ధాటికి న్యూజిలాండ్‌ వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు మారియూ (1), వైట్‌ (18)లతో పాటు లెల్‌మన్‌ (24), కెప్టెన్‌ తష్కాఫ్‌ (10) కూడా విఫలం కావడంతో జట్టు స్కోరు 74/4 వద్ద నిలిచింది. ఈ స్థితిలో బెకమ్‌ వీలర్‌ (83 బంతుల్లో 75 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), లిడ్‌స్టోన్‌ (74 బంతుల్లో 44; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అయితే 43 పరుగుల వ్యవధిలో ఆ జట్టు మళ్లీ 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. షరీఫుల్‌ ఇస్లామ్‌ 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... షమీమ్‌ హుస్సేన్, హసన్‌ మురాద్‌ చెరో 2 వికెట్లు తీశారు.

మహ్మూదుల్‌ సెంచరీ... 
బంగ్లాదేశ్‌కు కూడా ఛేదనలో సరైన ఆరంభం లభించలేదు. తక్కువ వ్యవధిలో ఓపెనర్లు తన్‌జీద్‌ (3), పర్వేజ్‌ (14) అవుటయ్యారు. అయితే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మహ్మూదుల్‌ హసన్‌ జాయ్‌ (127 బంతుల్లో 100; 13 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శనతో జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. అతనికి తౌహీద్‌ (40), షహాదత్‌ హుస్సేన్‌ (40)లనుంచి మంచి సహకారం లభించింది. తౌహీద్‌తో మూడో వికెట్‌కు 68 పరుగులు, షహాదత్‌తో నాలుగో వికెట్‌కు 101 పరుగులు జోడించిన మహ్మూదుల్‌ సెంచరీ పూర్తయిన అనంతరం వెనుదిరిగాడు. యూత్‌ క్రికెట్‌లో అతనికి ఇది నాలుగో శతకం కావడం విశేషం.

మరిన్ని వార్తలు