బంగ్లా క్రికెటర్‌కు బ్రెయిన్ ట్యూమర్‌

12 Mar, 2019 16:35 IST|Sakshi

ఢాకా : బంగ్లాదేశ్ స్పిన్నర్ ముషారఫ్ హుస్సేన్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధ పడుతున్నాడు. దీనికి చికిత్స తీసుకోవడం కోసం త్వరలోనే సింగపూర్ వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.  ఆరోగ్యం బాగోలేదని ఢాకాలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన ముషారఫ్ హుస్సేన్‌కు..  అక్కడి వైద్యులు బ్రెయిన్‌ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇది ప్రారంభ దశలోనే ఉండడంతో సింగపూర్ వెళ్లి సర్జరీ చేయించుకోవచ్చని సూచించారు. దీంతో అతడు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే సింగపూర్ విమానం ఎక్కనున్నాడు. ముషారఫ్ హుస్సేన్‌ సర్జరీకి దాదాపు రూ. 40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు.

‘నాకు ట్యూమర్ ఉన్నట్లు తెలిసిన వెంటనే నేను, నా కుటుంబం చాలా ఆందోళనకు గురయ్యాం. అయితే, ఇది ప్రారంభ దశలోనే ఉందని తెలియగానే మాకు కొంత ఉపశమనం కలిగింది. నా ఆరోగ్య పరిస్థితి గురించి బంగ్లా క్రికెట్ బోర్డుకు చెప్పాను. అందరూ నన్ను ఆందోళన చెందొద్దని చెబుతున్నారు. నేను కూడా ధైర్యంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ జట్టు తరపున ఐదు అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. 2008 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హుస్సేన్‌.. 2016లో చివరిసారి వన్డే ఆడాడు. 112 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 3000కు పైగా పరుగులు చేయడంతో పాటు, 392 వికెట్లను పడగొట్టాడు.

మరిన్ని వార్తలు