బంగ్లాదేశ్‌ తడబాటు

5 Feb, 2017 23:40 IST|Sakshi
బంగ్లాదేశ్‌ తడబాటు

ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విఫలం
తొలి ఇన్నింగ్స్‌లో 224/8 డిక్లేర్డ్‌
భారత్‌ ‘ఎ’తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌  


హైదరాబాద్‌: భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌ జట్టు సన్నాహకం గొప్పగా సాగలేదు. భారత్‌ ‘ఎ’తో జింఖానా మైదానంలో ఆదివారం మొదలైన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. మ్యాచ్‌ తొలి రోజు తమ మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (106 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్‌), సౌమ్య సర్కార్‌ (73 బంతుల్లో 52; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. 67 ఓవర్లు మాత్రమే ఎదుర్కొన్న బంగ్లా, మొదటి రోజును పూర్తిగా బ్యాటింగ్‌ కోసం ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. అనంతరం బంగ్లాదేశ్‌ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న భారత్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టపోయి 91 పరుగులు చేసింది. ప్రియాంక్‌ పాంచల్‌ (62 బంతుల్లో 40 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 29 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ ‘ఎ’ మరో 133 పరుగులు వెనుకబడి ఉంది. మొత్తంగా బంగ్లా ఆశించిన విధంగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ మాత్రం ఆ జట్టుకు దక్కలేదు. ఏ దశలోనూ జట్టు జోరు కనబర్చలేదు. నంబర్‌వన్‌ ఆటగాడు షకీబ్‌ ఈ మ్యాచ్‌ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు.

ఆకట్టుకున్న పేసర్లు...
టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. చక్కటి బౌన్స్‌ ఉన్న పిచ్‌పై భారత్‌ ‘ఎ’ లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్లు అనికేత్, సీవీ మిలింద్‌ మంచి ప్రభావం చూపించారు. వీరిని ఎదుర్కోవడంలో బంగ్లా ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు. తన మూడో ఓవర్లో ఇమ్రుల్‌ కైస్‌ (4)ను అవుట్‌ చేసి హైదరాబాద్‌ బౌలర్‌ మిలింద్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత అనికేత్‌ చక్కటి బంతికి తమీమ్‌ (13) బౌల్డయ్యాడు. మరో ప్రధాన బ్యాట్స్‌మన్‌ మోమినుల్‌ (5) కూడా విఫలం కావడంతో బంగ్లా ఇబ్బందుల్లో పడింది. మరో ఎండ్‌లో మాత్రం సౌమ్య సర్కార్‌ ధాటిగా ఆడాడు. కవర్స్, మిడాన్‌ దిశగా కొన్ని చూడచక్కటి బౌండరీలు కొట్టిన సర్కార్‌ 55 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటికే నదీమ్‌ బౌలింగ్‌లో అతను అవుట్‌ కాగా, మహ్ముదుల్లా (23) ఫర్వాలేదనిపించాడు. కివీస్‌తో జరిగిన గత టెస్టులో గాయపడి కోలుకున్న తర్వాత తొలిసారి మైదానంలోకి దిగిన కెప్టెన్‌ ముష్ఫికర్‌ కూడా నిలకడ ప్రదర్శించాడు. షబ్బీర్‌ (33)తో కలిసి అతను ఆరో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. జయంత్‌ బౌలిం గ్‌లో భారీ సిక్సర్‌ బాదిన ముష్ఫికర్‌ 91 బంతుల్లో హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. ఇన్నింగ్స్‌ 61వ ఓవర్లోనే బంతి ఆకారం దెబ్బ తింది. దాంతో అంపైర్లు బంతిని మార్చారు. వెంటనే వరుస బంతుల్లో ముష్ఫి కర్, హసన్‌ (0)లను అనికేత్‌ అవుట్‌ చేశాడు. మరో 6 ఓవర్ల తర్వాత బంగ్లా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

రాణించిన పాంచల్‌...
ఇన్నింగ్స్‌ తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభినవ్‌ ముకుంద్‌ (16) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే రంజీ ట్రోఫీ ఫామ్‌ను కొనసాగిస్తూ పాంచల్‌ చక్కటి షాట్లు ఆడాడు. మరో ఎండ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ధాటిని ప్రదర్శించాడు. బంగ్లా బౌలింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

మరిన్ని వార్తలు