బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీప్‌ 

7 Mar, 2020 01:52 IST|Sakshi

మూడో వన్డేలో 123 పరుగులతో ఓడిన జింబాబ్వే

లిటన్‌ దాస్, తమీమ్‌ సెంచరీలు

సిల్హెట్‌: ఇప్పటికే వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న బంగ్లాదేశ్‌ వర్షం అంతరాయం కలిగించిన మూడో వన్డేలోనూ సత్తా చాటింది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (109 బంతుల్లో 128 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), లిటన్‌ దాస్‌ (143 బంతుల్లో 176; 16 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగడంతో... జింబాబ్వేతో శుక్రవారం జరిగిన చివరి వన్డేలో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 123 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా జట్టు 43 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది.

33.2 ఓవర్లలో బంగ్లాదేశ్‌ 182/0తో ఉన్న సమయంలో వాన రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ఓపెనర్లు లిటన్‌ దాస్, తమీమ్‌ తొలి వికెట్‌కు 292 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు శుభారంభం అందించారు. వన్డేల్లో బంగ్లాదేశ్‌కు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగ స్వామ్యం. అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం జింబాబ్వే లక్ష్యాన్ని 43 ఓవర్లలో 342 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనలో జింబాబ్వే 37.3 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై ఓడింది. సికిందర్‌ రాజా (50 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మొహమ్మద్‌ సైఫుద్దీన్‌ 4 వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు