‘సెకండ్‌ విక్టరీ’ ఎవరిదో?

17 Jun, 2019 14:54 IST|Sakshi

టాంటాన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ద కూపర్‌ అసోసియేట్స్‌ కౌంటీ గ్రౌండ్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌ మష్రాఫ్‌ మొర్తజా ముందుగా వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకూ తలో నాలుగు మ్యాచ్‌లు ఆడగా చెరో మ్యాచ్‌ మాత్రమే గెలిచాయి. ఇందులో ఇరు జట్లు ఆడాల్సిన ఒక్కో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన వెస్టిండీస్‌.. ఆపై గెలుపును అందుకోలేకపోయింది. ఇక దక్షిణాఫ్రికాను కంగుతినిపించిన బంగ్లాదేశ్‌ది కూడా అదే పరిస్థితి. దాంతో  ఇక నుంచి ఇరు జట్లకు ప్రతీ మ్యాచ్‌ కీలకం. ఈ నేపథ్యంలో ఆసక్తికర సమరం జరిగే అవకాశం ఉంది.

కాగా, ముఖాముఖి రికార్డులో వెస్టిండీస్‌దే పైచేయి. ఇప్పటివరకూ ఇరు జట్ల 37 వన్డేలు తలపడగా, అందులో విండీస్‌ 21 మ్యాచ్‌లు విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ 14 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందగా, రెండింట ఫలితం తేలలేదు. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా, మూడు మ్యాచ్‌ల్లో విండీస్‌ విజయం సాధించగా, బంగ్లాదేశ్‌ మాత్రం విజయాన్ని సాధించడంలో విఫలమైంది. మరొక మ్యాచ్‌ రద్దయ్యింది.  ఇదిలా ఉంచితే,  వెస్టిండీస్‌తో తలపడిన చివరి నాలుగు వన్డేల్లో బంగ్లానే విజయం సాధించడంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది.  అదే సమయంలో విండీస్‌ కూడా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో విజయంపై ధీమాగా ఉంది. ఇరు జట్లు రెండో విజయం కన్నేయడంతో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.

తుది జట్లు

వెస్టిండీస్‌
జేసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, షాయ్‌ హోప్‌, డారెన్‌ బ్రేవో, నికోలస్‌ పూరన్‌,  షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌, ఆండ్రీ రసెల్‌, షెల్డాన్‌ కాట్రెల్‌, ఓష్నీ థామస్‌, షెనాన్‌ గాబ్రియెల్‌

బంగ్లాదేశ్‌
మష్రాఫ్‌ మొర్తజా(కెప్టెన్‌), తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకీబుల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటాన్‌ దాస్‌, మహ్మదుల్లా, మొసద్దెక్‌ హుస్సేన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, మెహిదీ హసన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌


 

మరిన్ని వార్తలు