అండర్‌-19 ప్రపంచకప్‌ విజేత బంగ్లాదేశ్‌

9 Feb, 2020 21:53 IST|Sakshi

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా) : అండర్‌-19 ప్రపంచకప్‌లో మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్‌ టీమిండియాపై 3వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ట్రోపీని ముద్దాడింది. చివర్లో వర్షం ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆటను 46 ఓవర్లలో 170 పరుగులకు కుదించారు. బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీ 43పరుగులతో చివరివరకు అజేయంగా నిలిచి అండర్‌-19 క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇతనికి తోడుగా బంగ్లా ఓపెనర్‌ పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ 47 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 4వికెట్లు, సుషాంత్‌ మిశ్రా 2వికెట్లు తీశారు. కాగా 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాను కెప్టెన్‌ అక్బర్‌ అలీ, ఓపెనర్‌ పర్వేజ్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైశ్వాల్‌ 88 పరుగులతో మరోసారి రాణించగా, తిలక్‌ వర్మ 38, దృవ్‌ జూరెల్‌ 22 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో అవిషేక్‌ దాస్‌ 3వికెట్లు, శౌరిఫుల్‌ ఇస్లామ్‌, తంజిమ్‌ హసన్‌ తలా 2వికెట్లు తీశారు.

>
మరిన్ని వార్తలు