పాపం.. బంగ్లాదేశ్‌!

17 Jan, 2017 00:05 IST|Sakshi
పాపం.. బంగ్లాదేశ్‌!

తొలి టెస్టులో అనూహ్య పరాజయం
కేన్‌ విలియమ్సన్‌ అద్భుత శతకం
ఏడు వికెట్లతో నెగ్గిన న్యూజిలాండ్‌  


వెల్లింగ్టన్‌: తమ టెస్టు చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్‌పై టెస్టు విజయాన్ని ఆశించిన బంగ్లాదేశ్‌కు ఊహించని భంగపాటు ఎదురైంది. కివీస్‌ గడ్డపై తమ తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 595 పరుగుల భారీ స్కోరు సాధించిన ఈ జట్టు... చివరకు దారుణ పరాజయంతో ‘చెత్త’ రికార్డును కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (90 బంతుల్లో 104 నాటౌట్‌; 15 ఫోర్లు) మెరుపు సెంచరీ సహాయంతో న్యూజిలాండ్‌ ఏడు వికెట్లతో అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్‌ రెండు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సంపాదించింది. చివరిదైన రెండో టెస్టు క్రైస్ట్‌ చర్చ్‌లో శుక్రవారం నుంచి జరుగుతుంది.

ఆట చివరి రోజు సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 66/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ జట్టు కివీస్‌ బౌలర్ల ధాటికి 57.5 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. బౌల్ట్‌ (3/53), సాన్‌ట్నర్‌ (2/36), వాగ్నర్‌ (2/37) కలిసి బంగ్లా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. షబ్బీర్‌ రహమాన్‌ (101 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన షకీబ్‌ ఈసారి డకౌట్‌గా వెనుదిరగడం జట్టును దెబ్బతీసింది. ఇక నాలుగో రోజు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన ఓపెనర్‌ కైస్‌ (46 బంతుల్లో 36 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఏడో వికెట్‌ అనంతరం బరిలోకి దిగినా... వికెట్ల మధ్య పరిగెత్తలేక బౌండరీలపై ఆధారపడ్డాడు. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇక 48 ఓవర్లలో 217 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌ వన్డే తరహాలో చెలరేగింది. 39.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి గెలిచింది. రాస్‌ టేలర్‌ (77 బంతుల్లో 60; 6 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. విలియమ్సన్, టేలర్‌ మధ్య మూడో వికెట్‌కు 163 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. మెహదీ హసన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

స్పృహ కోల్పోయిన ముష్ఫికర్‌ రహీమ్‌
చివరి రోజు ఆటలో బంగ్లా కెప్టెన్‌ ముష్ఫికర్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోవడంతో కలకలం రేగింది. బంగ్లా రెండో ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌లో టిమ్‌ సౌతీ వేసిన బౌన్సర్‌ అతడి హెల్మెట్‌ వెనుక భాగాన బలంగా తాకింది. దీంతో వెంటనే కుప్పకూలిన ముష్ఫికర్‌కు చికిత్స అందించేందుకు ఇరు జట్ల వైద్య సిబ్బంది తరలివచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఎక్స్‌రే తీసిన అనంతరం అతడికి ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తను మళ్లీ బ్యాటింగ్‌ చేసేందుకు మాత్రం రాలేదు.

తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు (595/8) సాధించినా టెస్టు మ్యాచ్‌ను ఓడిన జట్టుగా బంగ్లాదేశ్‌ రికార్డులకెక్కింది. 123 ఏళ్ల క్రితం (1894) ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 586 పరుగులు చేసి ఓడింది.

నాలుగో ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని 6.43 రన్‌రేట్‌తో అత్యంత వేగంగా సాధించిన తొలి జోడిగా విలియమ్సన్, టేలర్‌ గుర్తింపు పొందింది.

తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసి రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన ఏడో బ్యాట్స్‌మన్‌ షకీబ్‌. ఏడేళ్ల తర్వాత అతనికిదే తొలి డకౌట్‌.

మరిన్ని వార్తలు