బంగ్లాదేశ్ చారిత్రక విజయం

31 Oct, 2016 23:43 IST|Sakshi
బంగ్లాదేశ్ చారిత్రక విజయం

తమ చరిత్రలో తొలిసారి ఇంగ్లండ్‌పై టెస్టు మ్యాచ్ విజయం
మెహదీ హసన్ సంచలన బౌలింగ్
 ఒకే సెషన్‌లో ఆలౌటైన కుక్ సేన  

 
ఢాకా: తమ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ ఓ గొప్ప విజయం సాధించింది. మొట్టమొదటిసారి ఇంగ్లండ్‌పై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. షేరే బంగ్లా స్టేడియంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 108 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రా చేసింది. మూడో రోజు మ్యాచ్ నాటకీయంగా సాగింది. బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్‌‌సలో 66.5 ఓవర్లలో 296 పరుగులు చేసి ఆలౌటరుుంది. దీంతో ఇంగ్లండ్‌కు 273 పరుగుల లక్ష్యం ఎదురరుుంది. ఓపెనర్లు కుక్ (59), డకెట్ (56) నిలకడగా ఆడటంతో టీ విరామ సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 100 పరుగులతో విజయం దిశగా సాగింది. కానీ ఆ తర్వాత నాటకీయంగా కుప్పకూలింది. కెరీర్‌లో కేవలం రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్ మీర్జా (6/77) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరు వికెట్లు తీశాడు. తనతో పాటు సీనియర్ క్రికెటర్ షకీబ్ (4/49) చెలరేగిపోయాడు.

ఈ ఇద్దరి ధాటికి ఒకే సెషన్‌లో ఇంగ్లండ్ 64 పరుగుల వ్యవధిలో మొత్తం పది వికెట్లు కోల్పోరుుంది. ఏడుగురు బ్యాట్స్‌మెన్ కనీసం రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. బంగ్లాదేశ్ టెస్టు చరిత్రలో ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ (12/159) గణాంకాలు నమోదు చేసిన మెహదీ హసన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించారుు. తొలి టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగులతో గెలిచింది. భారత పర్యటనకు ముందు ఇంగ్లండ్ జట్టుకు బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పెద్ద షాక్. అటు బంగ్లా  విజయంతో ఆ దేశంలో సంబరాలు జరిగారుు.
 
► 2000వ సంవత్సరంలో టెస్టు హోదా లభించాక బంగ్లాదేశ్ ఇప్పటివరకూ 95 మ్యాచ్‌లు ఆడగా... ఇది ఎనిమిదో విజయం మాత్రమే.
► జింబాబ్వే, వెస్టిండీస్‌లపై కాకుండా మరో జట్టుపై బంగ్లాదేశ్ టెస్టు గెలవడం ఇదే తొలిసారి.
 
 

మరిన్ని వార్తలు