‘బంగ్లాదేశ్‌తో భారత్‌ కావాలనే ఓడుతుంది’

28 Jun, 2019 12:06 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌ : తిరుగులేని ఆటతో టోర్నీలో ఓటమెరుగని జట్టుగా తమ స్థాయిని చూపిస్తూ దాదాపుగా సెమీఫైనల్‌ స్థానాన్ని ఖాయం చేసుకున్న కోహ్లిసేన బంగ్లాదేశ్‌, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లను మాత్రం కావాలనే ఓడిపోతుందని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌ జట్టు సెమీఫైనల్‌కు రావద్దనే దురుద్దేశంతోనే కోహ్లిసేన ఓడిపోతుందన్నాడు. ఓ టీవీ చానెల్‌లో చేసిన ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ సాజ్‌ సాధిక్‌ ట్వీటర్‌లో పంచుకున్నారు.

‘భారత్‌ ఎప్పుడూ పాకిస్తాన్‌ సెమీస్‌కు రావాలని కోరుకోదు. వారి తదుపరి మ్యాచ్‌ బంగ్లాదేశ్‌, శ్రీలంకతో ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ కావాలనే ఓడిపోతుంది. అఫ్గానిస్తాన్‌పై భారత్‌ గెలుపును ప్రతి ఒక్కరం చూశాం. అఫ్గాన్‌పై భారత్‌ కావాలనే అలా ఆడింది. భారత్‌తో మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ కూడా ఉద్దేశపూర్వకంగానే ఔటయ్యాడు’  అని బసిత్‌ అలీ ఆరోపించాడు. ఇక బసిత్‌ అలీ పాకిస్తాన్‌ తరపున 19 టెస్ట్‌లు, 50 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం ఇతని వ్యాఖ్యలపై ఇరుదేశాల అభిమానులు మండిపడుతున్నారు. బసిత్‌ అలీది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసిన బుద్ది కదా.. ఇలానే ఆలోచిస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్థంలేని మాటలతో విలువ తగ్గించుకోకంటూ చురకలంటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇక భారత్‌తో ఘోరపరాజయం అనంతరం పాకిస్తాన్‌ పుంజుకుంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ ఓడించి సెమీస్‌ రేసులో నిలిచింది. సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే పాక్‌.. తమ తదుపరి మ్యాచ్‌లు అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌ తప్పక గెలవాలి. ప్రస్తుతం ఏడు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న పాక్‌.. మరో రెండు గెలిస్తే 11 పాయింట్లతో సెమీస్‌ బెర్త్‌కు పోటీ ఎదుర్కోనుంది.

>
మరిన్ని వార్తలు